దర్శన భాగ్యమెలా ?.. ‘కొవిడ్‌’ పేరుతో భద్రాద్రిలో నోఎంట్రీ

ABN , First Publish Date - 2020-12-18T04:42:56+05:30 IST

దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలంలో ముక్కోటి ఏకదశిరోజున రామయ్య దర్శనానికి అవకాశం ఇవ్వకపోవడంపై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే తిరుమలలో సైతం కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూనే ముక్కోటి రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటిచింది. కానీ భద్రాచలంలో మాత్రం ఉత్తరద్వార దర్శనానికి సామాన్య భక్తులపై ఎందుకీ వివక్ష అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

దర్శన భాగ్యమెలా ?.. ‘కొవిడ్‌’ పేరుతో భద్రాద్రిలో నోఎంట్రీ
భద్రాచలం రామాలయం

తిరుమలలో లక్ష మందికి అవకాశం

దీక్షావస్త్రాలు సైతం అందరికీ లేవట 

భద్రాద్రి చరిత్రలో ఇదే తొలిసారి 

‘ముక్కోటి’ వేళ అంక్షలపై సామాన్యుల ఆగ్రహం 

 భద్రాచలం, డిసెంబరు 17: దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలంలో ముక్కోటి ఏకదశిరోజున రామయ్య దర్శనానికి అవకాశం ఇవ్వకపోవడంపై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే తిరుమలలో సైతం కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూనే  ముక్కోటి రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటిచింది. కానీ భద్రాచలంలో మాత్రం ఉత్తరద్వార దర్శనానికి సామాన్య భక్తులపై ఎందుకీ వివక్ష అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రామభక్తులు, ఆధ్యాత్మికవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కోటి రోజున 200మంది వీఐపీలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఇప్పటికే దేవస్థానం అధికారులు ప్రకటించడంతో మరి సామాన్య భక్తులు చేసుకున్న పాపం ఏంటని రామభక్తులు వాపోతున్నారు. కొవిడ్‌ నిబంధనలు వీఐపీలకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల పేరిట సామాన్య భక్తులను కాదని వీఐపీలకు అగ్రతాంబూలం ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్న వ్యాఖ్యానిస్తున్నారు. దేవుడి ముందు అందరూ సమానమనే కనీస ధర్మాన్ని సైతం విస్మరించడం భావ్యం కాదని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో లేని నిబంధనలను భద్రాచలంలో అధికార యంత్రాంగం బలవంతంగా ఎందుకు రుద్దాలని చూస్తోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఏమాత్రం పట్టింపులేని కరోనా నిబంధనలు భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఉత్సవాల విషయంలో ఎందుకంత పట్టింపులకు వెళుతున్నారని ప్రశ్నిస్తున్నారు. 

ఎందుకిలా జరిగింది ?

ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభం రోజున ఆలయంలో ఏటా ప్రబంధాలు, ఇతిహాసాలు, తదితర వాటిని పారాయణం చేసే పారాయణదారులతో పాటు వైదిక పరిపాలన సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందజేయడం సంప్రదాయం. కానీ ఈసారి వైదిక పరిపాలన సిబ్బంది అందరికి దీక్షా వస్త్రాలు అందలేదని విశ్వసనీయ సమాచారం. అతికొద్ది మందికి మాత్రమే(అది కూడా బయట నుంచి వచ్చిన పారాయణదారులతో పాటు కొద్దిమంది సిబ్బందికి) దీక్ష వస్త్రాలన అందజేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై దేవస్థానం సిబ్బంది అంతర్గతంగా చర్చింకుంటున్నారు.  దీక్షా వస్త్రాలను అందజేయకపోవడం భద్రాద్రి చరిత్రలో ఇదే తొలిసారి అని పలువురు వైదిక సిబ్బంది పేర్కొంటున్నారు.  

పొదుపుమంత్రం అంటూనే రూ.50 లక్షల ఖర్చు

కొవిడ్‌ నేపధ్యంలో ముక్కోటి అధ్యయనోత్సవాల నిర్వహణ విషయంలో భద్రాద్రి దేవస్థానం అధికారులు పొదుపు మంత్రం అంటూనే ఏర్పాట్లకు సుమారు రూ.50లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో రూ.25 లక్షలు విద్యుత్‌ దీపాలంకరణ, రంగులు, సెట్టింగ్‌లు ఇతర అలంకరణలకు వెచ్చించినట్లు వారు పేర్కొంటున్నారు. ఇంత భారీగా ఖర్చు చేసిన అధికారులు గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించకపోవడం సమజంసం కాదని దేవస్థానం వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఒకవైపు భక్తులపై ఎన్నడూ లేని ఆంక్షలను విధిస్తూనే మరో వైపు ఇంత భారీగా ఖర్చు చేయడం వల్ల ఈ లోటును ఎలా పూడ్చుకోవాలని దేవస్థానం వర్గాల్లో అంతర్గత చర్చ సాగుతోంది. 


Updated Date - 2020-12-18T04:42:56+05:30 IST