పోలీసుశాఖలో కలకలం

ABN , First Publish Date - 2020-03-24T12:21:24+05:30 IST

జిల్లాలో రెండో కరోనా కేసు నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు.

పోలీసుశాఖలో కలకలం

మరో 20 మంది అనుమానితులకు కౌన్సెలింగ్‌

పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలింపు  


(ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం): జిల్లాలో రెండో కరోనా కేసు నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. అధికార యంత్రాంగం  ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఓ పోలీసు అధికారి తనయుడికి కరోనా పాజిటీవ్‌ రావడంతో ఆ శాఖలో కలకలం మొదలైంది. లండన్‌లో చదువుతున్న సదరు విద్యార్థి ఈ నెల 18వ తేదీన జిల్లాకు వచ్చాడు. వచ్చిన తరువాత అతడికి తుమ్ములు, దగ్గు, జలుబు, జ్వరం రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించారు. డీఎస్‌ఓ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారించారు. దీంతో పోలీసు అధికారులు, కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది.


సదరు పోలీసు అధికారికి సన్నిహితులుగా ఉన్న పోలీసు సిబ్బంది, వారి బంధువులు, స్నేహితులందరినీ సోమవారం ప్రత్యేక వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 16మంది పోలీసులు, ఐదుగురు పోలీసు అధికారి కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతో వారిలో ఆందోళన మొదలైంది. లండన్‌ నుంచి వచ్చిన సదరు విద్యార్థి తన సొంత గ్రామంలో సమీప బంధువుల గృహ ప్రవేశానికి సైతం వెళ్లినట్లు సమాచారం. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై సదరు ఇంటి పరిసరాలకు వెళ్లి ఫాగింగ్‌ చేయించారు. ఇంటి చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 125 మంది విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి వారందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు స్వచ్ఛందంగా క్వారంటైన్‌ పాటించాలన్నారు.


జిల్లాలో క్వారంటైన్‌, ఐసీయు, ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశామని, స్వీయ నియంత్రణ పాటించకుండా, సమాచారాన్ని తెలపకుండా గోప్యత పాటిస్తే కుటుంబ సభ్యులపై జాతీయ ఉపద్రవ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులైనా  ఇంకెవరైనా సమాచారం ఇచ్చి క్వారంటైన్‌ పాటించాలని, లేకపోతే చట్టప్రకారంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారంటైన్‌లో ఉన్న వారు బయటికి వస్తే టీమ్‌ అధికారులను బాధ్యులను చేసి వ్యాధి నియంత్రణ చట్టం కి ంద తక్షణం విధుల నుంచి సస్పెండ్‌ చేస్తామన్నారు.Read more