సీపీఐ ద్వారా పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-10-28T10:35:32+05:30 IST

ఖమ్మం జిల్లాలో వెంటనే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఖమ్మం నగరంలోని వ్యవసాయ

సీపీఐ ద్వారా పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి

పత్తి మార్కెట్‌ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని


ఖమ్మం మార్కెట్‌, అక్టోబరు 27: ఖమ్మం జిల్లాలో వెంటనే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాల కారణంతో పత్తి దిగుబడి తగ్గిపోయిందని, వ్యాపారులు తేమ పేరుతో ధర తగ్గించి రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్‌లో పత్తి రైతులతో ముచ్చటించి ధరల వివరాలు తెలసుకున్నారు. వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేశారని ఆగ్రహించిన ఆయన కొద్ది సేపు కాంటాలను నిలుపిలేసి రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అధిక వర్షాలకు పత్తి రంగు మారి, దిగుమతి తగ్గిందని కూలీల ఖర్చులు సైతం పెరిగాయని ఈ ధరలతో పెట్టుబడి కూడా లభించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణను కలిసి సీపీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మధ్దతు ధర రూ. 5,825కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులను ఫోన్‌లో కోరారు.


వారు నవంబరు మూడో తేదీ నుంచి సీసీఐ కొనుగోళ్లు జరుపుతామని ప్రకటించినట్లు మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంత్‌రావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, నాయకులు మౌలానా, శింగు నర్సింహారావు, బీజీ క్లెమెంట్‌, మందడపు నాగేశ్వరరావు, అడపా రామకోటయ్య, మహ్మద్‌ సలాం, యర్రా బాబు, సీతామహాలక్షి, లతాదేవి, గోవిందరావు, వెంకటేశ్వరరావు, రామక్రిష్ణ, రామ్మూర్తి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T10:35:32+05:30 IST