ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన తెల్లబంగారం

ABN , First Publish Date - 2020-12-02T04:44:10+05:30 IST

ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం తెల్ల బంగారం (పత్తి) పోటెత్తింది. సుమారు 10వేల బస్తాల పత్తి అమ్మకానికి రాగా.. నెలరోజుల్లో మార్కెట్‌కు ఇంత మొత్తంలో పంట రావడం ఇదే ప్రథమం.

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన తెల్లబంగారం


అమ్మకానికి వచ్చిన 10వేల బస్తాల పత్తి

ఖమ్మం మార్కెట్‌, డిసెంబరు 1: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం తెల్ల బంగారం (పత్తి) పోటెత్తింది. సుమారు 10వేల బస్తాల పత్తి అమ్మకానికి రాగా.. నెలరోజుల్లో మార్కెట్‌కు ఇంత మొత్తంలో పంట రావడం ఇదే ప్రథమం. అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు ఉధృతి, తదితర కారణాలతో ఈ ఏడాది దిగుబడి సగానికి తగ్గిన నేపథ్యంలో మార్కెట్‌ యార్డులకు పత్తి రాక మందగించింది. ఇటీవల నివర్‌ తుఫాన్‌ కారణంగా యార్డులకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి సెలవులు కూడా రావడంతో మంగళవారం రైతులు తమ పంటలను భారీగా అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో ఉదయం 7 గంటలకల్లా పత్తి యార్డు బస్తాలతో నిండిపోయింది. మార్కెట్‌కు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాలనుంచి రైతులు తమ పంటలను అమ్మకానికి తీసుకొచ్చారు. అయితే మార్కెట్‌కు పత్తి పోటెత్తడంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల క్రితం క్వింటా రూ.5,600 వరకు గరిష్ఠ ధర పలికగా.. మంగళవారం రూ.200 తగ్గించి కొనుగోలు చేయడం విశేషం. క్వింటా పత్తిని కనిష్ఠంగా రూ.3,500 నుంచి రూ.4,000 వరకు, గరిష్ఠంగా రూ.4,500 నుంచి రూ.5,000 వరకు కొనుగోలు చేశారు. డీలక్స్‌ రకం పత్తిని గరిష్ఠంగా రూ.5,400కు అంటే చాలా తక్కువ మొత్తంలో కొనడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-02T04:44:10+05:30 IST