జోరుగా జీరో దందా
ABN , First Publish Date - 2020-12-20T04:54:56+05:30 IST
జిల్లాలో తెల్లబంగారం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ పండించిన పత్తిని పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు రైతుల పేర్లతో వ్యాపారులు అడ్డదారిలో తరలిస్తున్నారు.

రైతుల పేరుతో పత్తి తరలిస్తున్న వ్యాపారులు
దళారులతో జిన్నింగ్ మిల్లుల నిర్వాహకుల మిలాఖత్
మార్కెట్ సెస్, జీఎస్టీకి మంగళం
లారీకి సుమారు రూ.60 నుంచి రూ.80 వేల లాస్
రాత్రివేళల్లో యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు రవాణా
ఖమ్మం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో తెల్లబంగారం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ పండించిన పత్తిని పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు రైతుల పేర్లతో వ్యాపారులు అడ్డదారిలో తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీతోపాటు మార్కెటింగ్‌శాఖకు చెల్లించాల్సిన సెస్ జమకావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల జయమానులు మిలాఖత్ అయి జీరో దందాను నడుపుతున్నారు.
పొరుగు వ్యాపారుల కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా పత్తిని వేశారు. జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, తల్లాడ, రఘునాధపాలెం, చింతకాని, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, మధిర, బోనకల్, సుజాతనగర్, ములకలపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పెద్దఎత్తున పత్తి సాగుచేశారు. వర్షాలకు దెబ్బతిన్నప్పటికి రెండు, మూడు విడతల పత్తి నాణ్యంగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన పత్తి వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు వ్యవసాయ మార్కెట్లతోపాటు గ్రామాల్లో పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
దళారులతో రాత్రివేళ రవాణా
జూలూరుపాడు, ఏన్కూరు, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి కేంద్రాల్లో పత్తి ఉత్పత్తి అధికంగా ఉంది. ఆ ఆమండాలను కేంద్రాలుగా చేసుకుని పొరుగురాష్ట్రాల వ్యాపారులు స్థానిక దళారులతో కొనుగోలు చేయించి రాత్రివేళ పత్తిని లారీల్లో తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు సెస్ చెల్లించి తరలిస్తుండగా మరికొందరు వ్యాపారులు రైతులపేర్లతో తప్పుడు పత్రాలు పెట్టి స్వరాష్ట్రాలకు పత్తిని తరలించుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది.
సెస్, జీఎస్టీ చెల్లింపులు నిల్
చెక్‌పోస్టుల్లో ముడుపులు చెల్లించి పత్తిని తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు సీసీఐకి తరలిస్తున్నామని చెబుతు రైతుల పాసుపుస్తకాల జిరాక్సులు చూపి వారి పేర్లతో రవాణా చేస్తున్నారు. దీంతో ప్రతీ లారికి రూ.60నుంచి 80వేలు ఆదాయం గండి పడుతోంది. ఒకలారీలో పదిలక్షల రూపాయలవవిలువైన పత్తిని తరలిస్తే మార్కెటింగ్‌శాఖకు 1శాతం చొప్పున రూ.10వేలు, జీఎస్టీకి 5శాతం చొప్పున రూ.50వేలు చెల్లించాలి. పెద్దలారీల్లో తరలిస్తే పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే పన్ను చెల్లించకుండా రైతుల పేర్లతో వ్యాపారులు రాత్రి వేళ పొరుగురాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రధాన రహదారుల వెంట నిఘాపెడితే పత్తి వ్యాపారులు సాగిస్తున్న జీరోదందా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా లారీలుపట్టుబడితే అధికార పార్టీనేతలతో పైరవీలు సాగిస్తున్నారు.