కాంట్రాక్టర్లకు అధికారుల అభయహస్తం
ABN , First Publish Date - 2020-12-28T04:47:01+05:30 IST
కాంట్రాక్టర్లకు అధికారుల అభయహస్తం

టెండర్లు తెరవకముందే ఖమ్మంలో పనులు ప్రారంభం
ఖమ్మం కార్పొరేషన్, డిసెంబరు 27: అధికారులు కాంట్రాక్టర్లకు అభయహస్తం ఇస్తున్నారా? టెండర్లు పూర్తి కాకముందే కాంట్రాక్టర్లు పనులు ఎందుకు మొదలుపెడు తున్నారు? అన్నది ప్రస్తుతం ఖమ్మం నగరపాలక సంస్థలో మిలి యన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రూ.5లక్షల విలువైన పనులు నామి నేషన్ పద్ధతిలో ఇచ్చారని అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితి అలా లేదు. రూ.13 లక్షల విలువైన పనులు కూడా టెండర్లు దాఖలు చేసి, వాటిని ఓపెన్ చేయకముందే కాంట్రాక్టర్లు పనులు మొదలు పెడుతున్నారు. ఇటీవల నగరపాలక సంస్థ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించారు. 28, 29 తేదీల్లో టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ ఒక కాంట్రాక్టర్ అప్పుడే పనులు ప్రారంభించటం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు కాంట్రాక్టర్ గతంలో చేసిన పనులపై విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ తనకు పని దక్కకముందే పనులు ప్రారంభించారు.
కార్యాలయంలోనే కాంట్రాక్టర్లు
నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే కొందరు కాంట్రాక్టర్ల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలున్నాయి. వారు ఎప్పుడూ నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో తిష్ట వేస్తూ, పనులు చేయించుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. తమకు సంబంధించిన ఫైళ్లను వారే డ్రాయింగ్‌బ్రాంచ్ విభాగం నుంచి ఇంజనీరింగ్ విభాగంలోకి తీసుకు వెళుతుంటారు. ఏఈలు, కంప్యూటర్ ఆపరేటర్ల పక్కన కూర్చొని తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. రాత్రి 7గంటల తరువాత నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలోకి వెళితే కొందరు కాంట్రాక్టర్ల లీలలు కళ్లకు కట్టినట్లు కనబడతాయి. వారి వ్యవహారశైలి చూస్తుంటే వారే నగరపాలక సంస్థ ఉద్యోగులేమో అన్న చందంగా ఉంటుంది. ఒక కాంట్రాక్టర్ ఏళ్ల తరబడి తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. బీరువాలో ఉన్న ఫైళ్లను సైతం యధేచ్ఛగా తీయగలుగుతున్నాడంటే అధికారుల సహకారం ఎంత ఉందో తెలుస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఒక ఏఈ వారికి బాగా మద్ధతు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో డ్రాయింగ్‌బ్రాంచ్‌లో పనిచేసినప్పటినుంచి సదరు ఏఈ కాంట్రాక్టర్లకు ఎంతో సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు అప్పట్లోనే ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా పనులు
నగరపాలక సంస్థలో చేపట్టే పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారనే విమర్శలున్నాయి. ఇటీవల పలు పనులకు సంబంధించి 21న టెండర్లను ఆహ్వానించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు 24వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారు. కాగా 29న బిడ్లు ఓపెన్ చేయాల్సిఉంది. అయినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు బిడ్లు తెరవకముందే పనులు ప్రారంభిస్తున్నారు. తమకే సదరు పని వస్తుందని ధీమాగా చెప్పటం గమనార్హం. కాగా వేరే వ్యక్తికి పనులు దక్కినా, బెదిరింపులకు పాల్పడు తుండటంతో నగరపాలకసంస్థలో కలుషిత వాతావరణం నెలకొంది. నగర పాలక సంస్థ కమిషనర్ పనుల విషయమై దృష్టి సారిస్తే అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య ఒప్పందాలు బట్టబయలయ్యే అవకాశం ఉంది.