లక్షణాలు కనిపించకుండానే కరోనా

ABN , First Publish Date - 2020-04-07T10:06:05+05:30 IST

ప్రపంచాన్ని భయపడుతున్న కరోనా మహమ్మారి తమ ప్రాంతం లో లేదనుకుంటున్న సమయంలో

లక్షణాలు కనిపించకుండానే కరోనా

ఓ గిరిజన నేతకు కోవిడ్‌-19గా పాజిటివ్‌ రిపోర్టు

వైద్యసేవలకు గాంధీ ఆసుపత్రికి తరలింపు

సన్నిహితంగా మెలిగిన 45మంది గుర్తింపు

వెల్లడించిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి


ఖమ్మం సంక్షేమవిభాగం, ఏప్రిల్‌ 6: ప్రపంచాన్ని భయపడుతున్న కరోనా మహమ్మారి తమ ప్రాంతం లో లేదనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా ఉలిక్కిపడే విషయం తెలిసింది. ఢిల్లీ వెళ్లిన ఓ గిరిజన నేతకు కోవిడ్‌-19 లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడం వైద్యఆరోగ్యశాఖలో విస్మయాన్ని కలిగించింది. సోమవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి కరోనా పాజిటివ్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఖమ్మం నగరంలోని మొదటి డివిజన్‌ పెద్దతండాకు చెందిన ఓ గిరిజన వ్యక్తి సామాజిక , రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. గత నెల 14న ఖమ్మం నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్లారు. 15వ తేది అక్కడే ఉన్న అంబేద్కర్‌ భవనంలో బస చేసి 16న ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఓ రాజకీయ పార్టీ అవిర్భావ  కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి అంబేద్కర్‌ భవనంలోనే బస చేసి 17న పలు ప్రాంతాల్లో పర్యటించారు. సాయంత్రానికి మరో 12మంది వ్యక్తులతో కలిసి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఖాజీపేటకు చేరుకున్నారు. 18న ఇంటికి చేరుకున్నారు. 19న ఖమ్మంలో తన స్నేహితుడితో కలిసి మయూరి సెంటర్‌కు సమీపంలో ఉన్న టీ సెంటర్‌కు వెళ్లారు. 20న తిరిగి ఇదే ప్రాంతా ల్లో సంచారించారు. 21నుంచి ఇంట్లోనే ఉన్నారు.


మహబూబాబాద్‌ వ్యక్తికి ..పాజిటివ్‌ రావటంతో ఖమ్మం వ్యక్తి గుర్తింపు

మహబూబాబాద్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి కరోనా పాజిటివ్‌గా రావడంతో అప్రమత్తంగా వ్యవహ రించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఆ వ్యక్తి నుంచి రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరించగా ఖమ్మం వ్యక్తి గురించి తెలిసిందన్నారు. దీంతో ఈనెల 2వ తేదీన సదరు వ్యక్తిని జిల్లా ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌ వార్డుకు తరలించామన్నా రు. 5వ తేదీన కరోనా వ్యాధి నిర్ధారణకు శాంపిల్‌ సేకరించి హైదరాబాద్‌కు పంపగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఆ వ్యక్తితో నేరుగా కలిసి మాట్లాడిన 45మంది పేర్లు ఇప్పటి వరకు సేకరించామని, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు భయపడాల్సిన పనిలేదని, కరోనా వ్యాప్తి చెందకుండా  చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Read more