కోరలు చాచిన కరోనా

ABN , First Publish Date - 2020-09-01T06:48:44+05:30 IST

ఐదు నెలలుగా ఆత్మస్థైర్యంతో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రైమరీ కాంటాక్టులకు కరోనా వైద్యసేవలు అందించిన

కోరలు చాచిన కరోనా

95మందికిపైగా వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులకు పాజిటివ్‌

ప్రోగ్రాం అఫీసర్ల నుంచి ఏఎన్‌ఎంల వరకు బాధితులు

జిల్లా ఆసుపత్రి ల్యాబ్‌ ఉద్యోగికి 39రోజుల్లో రెండో సారి పాజిటివ్‌


ఖమ్మం సంక్షేమవిభాగం, ఆగస్టు 31 : ఐదు నెలలుగా ఆత్మస్థైర్యంతో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రైమరీ కాంటాక్టులకు కరోనా వైద్యసేవలు అందించిన జిల్లా వైద్యఆరోగ్యశాఖపై కరోనా కోరలు చాచింది. ఇప్పటికే 95మందికిపైగా వివిధ విభాగాల్లోని ఉద్యోగులు వైరస్‌ బారిన పడటంతో వైద్యశాఖ అధికారులు ఆవేదన చెందుతున్నారు.


ముఖ్యంగా పదిహేను రోజులుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. పరీక్షల అనంతరం ఆయా కేంద్రాల్లో శానిటైజేషన్‌ విషయంలో నిర్లక్ష్యం చేయటంతో ఫలితంగా ప్రోగ్రామ్‌ అఫీసర్ల నుంచి ఏఎన్‌ఎంల వరకు కరోనా బారిన పడ్డారు. వైద్యులు, ఏఎన్‌ఎంలే ఎక్కవగా కరోనా పాజిటీవ్‌కు గురి కావటంతో వైద్యఆరోగ్యశాఖలో ఆందోళన నెలకొంది.


మళ్లీ మళ్లీ పాజిటివ్‌.. 

కరోనా పాజిటీవ్‌ వచ్చి కోలుకున్న వారికి మరోసారి అదీ కేవలం 39రోజుల్లోనే పాజిటివ్‌ వస్తుండటంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రి అధికారులు, ఉద్యోగుల్లో ఆలజడి నెలకొంది.. ఇప్పటి వరకు ఇతర దేశాల్లోనే ఇలా రెండో సారి పాజిటీవ్‌ కేసులు నమోదు జరుగుతున్నాయని, ఇప్పడు ఖమ్మం జిల్లాలోనూ నమోదవడం చర్చనీయాంశమైంది. కరోనా వచ్చి కోలుకున్న వారిలో ఆ వైరస్‌పై పోరాడే వ్యాధి నిరోదకశక్తి పెరుగుతోందని, రెండు నెలల సమయం వరకు వైరస్‌కు గురికారని వైద్యులు అంచనాలు వేశారు. కానీ ఖమ్మం జిల్లాలో ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌కి కేవలం 39రోజుల్లోనే మళ్లీ పాజిటీవ్‌ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


39రోజులకే రెండో సారి 

ఖమ్మం జిల్లా వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రి ల్యాబ్‌లో ఉద్యోగుల కొరత తీవ్రస్థాయిలో ఉంది. దీంతో ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తే మూడునెలలుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో ఆయన కరోనా బారిన పడ్డారు. క్వారంటైన్‌ సమయం పూర్తి చేసుకుని నెగిటివ్‌ రిపోర్టు రావటంతో విధుల్లో చేరారు. మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలో మూడు రోజులుగా ఆయనకు జ్వరం, తదితర లక్షణాలు రావటంతో మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. 


Updated Date - 2020-09-01T06:48:44+05:30 IST