పొంచి ఉన్న ‘కరోనా’ ముప్పు

ABN , First Publish Date - 2020-04-05T10:35:50+05:30 IST

ఇప్పటి వరకు కరోనా సేఫ్‌గా ఉన్న జిల్లాకు సరిహద్దు నుంచి ముప్పు పొంచి ఉంది. పొరుగున ఉన్న ఆంద్రాలోని కృష్ణా జిల్లాలో జిల్లా

పొంచి ఉన్న ‘కరోనా’ ముప్పు

కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విజృంభిస్తున్న కోవిడ్‌-19

సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో వణుకు 

నిఘాను ముమ్మరం చేసిన పోలీస్‌ శాఖ

ఎక్కడికక్కడ చెక్‌ పోస్టుల ఏర్పాటు 

పొరుగు ప్రాంతాల వారు రాకుండా చర్యలు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం)/మధిర/బోనకల్‌ :

ఇప్పటి వరకు కరోనా సేఫ్‌గా ఉన్న జిల్లాకు సరిహద్దు నుంచి ముప్పు పొంచి ఉంది. పొరుగున ఉన్న ఆంద్రాలోని కృష్ణా జిల్లాలో జిల్లా సరిహద్దు మండలాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆంధ్రా లోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాలోను కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ఖమ్మం జిల్లా సేఫ్‌ జోన్‌లో ఉంది. జిల్లా యంత్రాంగం కూ డా ఎప్పటికప్పుడు కరోనా నివారణ చర్యలను పర్యవేక్షిస్తూ పొరుగు ప్రాంతం వారు రాకుండా కట్టుదిట్ట చర్యలు చేపడుతోంది.


ఉదయం ఖమ్మంతోపాటు ఇతర మునిసిపల్‌ పట్టణాల్లో, రైతుబజార్లు, కిరాణషాపులవద్ద కొంత సందడి కనిపిస్తున్నా 11 గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. రాత్రివేళ కూడా పోలీసు యంత్రాంగం అన్నీ రహదారులపై నిఘాపెట్టి 500 వరకు పైగా వాహనాలు సీజ్‌ చేసింది. ఖమ్మం జిల్లానుంచి ఆంధ్రాకు రాకపోకలు పలు మార్గాల్లో అధికంగా ఉన్నాయి. ఆ మార్గాలపైనా, సరిహద్దు గ్రామాలపైనా జిల్లాపోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్టు సమాచారం. కృష్ణా జిల్లాలోని సరిహద్దు మండలాలు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సరిహద్దు మండలాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.


139 మందికి పరీక్షలు

ఇప్పటి వరకు జిల్లాలో 139 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 111 మందికి నెగిటివ్‌ వచ్చింది. మరో 28మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 571 మంది ఎన్‌ఆర్‌ఐలు రాగా అందులో 556 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. 15 మంది ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షణలో ఉన్నారు. దగ్గు, జలుబు ఉన్న వారికి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 951 మందికి శనివారం ఓపీ నిర్వహించారు. జిల్లాలో 143మందిని కరోనా ఐసోలేషన్‌ వార్డులో క్వారంటైన్‌లో ఉంచారు. 


అష్టదిగ్బంధంలో మధిర

కరోనా కట్టడిలో భాగంగా మధిర పట్టణం అష్టదిగ్బంధం లోకి వెళ్లింది. సరిహద్దున ఉన్న ఆంధ్రా ప్రాంతం నుంచి కరోనా ముప్పు పొంచి ఉండటంతో అఽధికారులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మధిరలోకి ఏ గ్రామం నుంచి రాకపోకలకు అవకాశం లేకుండా అన్ని వైపులా దారులను మూసివేశారు. ఆం ధ్రా ప్రాంతంలోని నందిగామ, జగ్గయ్యపేట మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగాయి. దీంతో శనివారం మధిర మునిసిపాలిటీలోకి ఎ వరూ రాకుండా టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ అన్ని సరిహద్దులను మూసివేయించారు. మడుపల్లి వద్ద శుక్రవారమే రోడ్డు మూసివేశారు. రాయపట్నం వద్ద నందిగామ నుంచి రాకపోకలను బంద్‌ చేశారు. ఇల్లెందులపాడులో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. ఆత్కూరు వద్ద కొత్తగా చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు.


పొలాల మీదుగా కొన్ని డొంకరోడ్లకు గండి కొట్టించారు. అంబారుపేటవద్ద కొత్తగా చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. దీంతో మధిర మున్సిపాల్టీ మొత్తం ప్రాంతంను అష్టదిగ్బందనం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది. అంతకుమించి ఎవరు వెళ్లినా కేసులు నమోదు చేస్తారు. ఈవిషయమై టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ను వివరణ కోరగా మున్సిపాలిటీకి వచ్చే అన్ని దారులు శనివారం బంద్‌ చేశామని తెలిపారు. అన్ని వైపులా ఆంధ్రా సరిహద్దు గ్రామాల నుంచి సంబంధాలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు.


మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మధిర పట్టణంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు బోనకల్‌ మండలంలోని గోవిందాపురం(ఎ) గ్రామం వద్ద గల ఆంధ్రా సరిహద్దు మార్గాన్ని శనివారం ప్రజా ప్రతినిధులు, ప్రజలు ముళ్లకంచెలతో మూసి వేశారు. బోనకల్‌ గ్రామ శివారు ప్రాంతంలో గల కృష్ణా జిల్లా వత్సవాయి సరిహద్దు మార్గాన్ని ఇప్పటికే పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. 

Updated Date - 2020-04-05T10:35:50+05:30 IST