26 రోజులుగా అక్కడ కరోనా కేసులు నిల్.. కానీ అనూహ్యంగా ఓ కేసు తెరపైకి..!

ABN , First Publish Date - 2020-05-19T18:15:26+05:30 IST

సుమారు 26రోజులుగా ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పల్లెల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. రోజుకు 1లక్ష20వేల మంది కూలీలు పనికి వెళ్తున్నారు. అలాగే భవన నిర్మాణాలు, ఇతర పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

26 రోజులుగా అక్కడ కరోనా కేసులు నిల్.. కానీ అనూహ్యంగా ఓ కేసు తెరపైకి..!

వలస వెళ్లి జిల్లాకు వచ్చిన వారితో కరోనా ప్రమాదం

హోంక్వారంటైన్‌లో నిబంధనలు బేఖాతరు

గ్రామీణంలో తొలి పాజిటివ్‌ నమోదు 

పని ప్రదేశాల్లో భయంభయం

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకున్న 2,209 మంది


ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సుమారు 26రోజులుగా ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పల్లెల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. రోజుకు 1లక్ష20వేల మంది కూలీలు పనికి వెళ్తున్నారు. అలాగే భవన నిర్మాణాలు, ఇతర పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో అలజడి రేగింది. మధిర మండలం మహదేవపురంలో వలస వెళ్లి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అందరిలోనూ మళ్లీ ఆందోళన మొదలైంది. పనిప్రదేశాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం చేయడం, మాస్కులు ధరించకపోవడం, కూలీలకు సరైన అవగాహన కల్పించకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. ఫలితంగా కరోనా ప్రబలితే పరిస్థితి చేయి దాటుతుందన్న ఆందోళన అటు అధికారులు, ఇటు ప్రజల్లో కనిపిస్తోంది. 


జిల్లాకు చేరుకున్న 2,209మంది

ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా నుంచి వివిధ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి.. లాక్‌డౌన్‌ సడలింపులతో తిరిగి జిల్లాకు చేరుకున్న వారిసంఖ్య 2,209మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,444మంది, ఇతర జిల్లాలనుంచి వచ్చిన వారు 765 మంది ఉన్నట్టు సమాచారం. వీరిలో 95శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని తమ నివాసాలకు వెళ్లారు. అయితే దాదాపు వీరందరిని గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం స్థానికంగా ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. పలువురిని హోంక్వారంటైన్‌ చేస్తున్నారు. 


క్వారంటైన్‌ జాగ్రత్తలు పాటించని వైనం..

వలసవెళ్లి వచ్చినవారికి వైద్యపరీక్షలు చేసిన అధి కారులు హోం క్వారంటన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో కుటుంబంలో ఎవరికి వారు ప్రత్యే కంగా ఉండే సదుపాయాలు ఉండవు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఎవరినీ కలవకుండా ఉండటం ఇబ్బందికరమే. అయినా హోంక్వారంటైన్‌లో ఉంటున్నామనిచెప్పి.. కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నారు. దీంతో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. మళ్లీ వారి ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. మధిర మండలం మహాదేవపురంలో 17 మందికిపైగా జాతకాలు చెప్పేందుకు మహారాష్ట్రలోని పుణె వెళ్లి ఈనెల 14న ప్రత్యేక వాహనంలో స్వగ్రామం చేరుకున్నారు. వారు హోంక్వారంటైన్‌లో ఉన్నా నిబంధనలు పాటించడంలేదని తెలిసింది. దీంతో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి సంబంధం ఉన్న 52మందిని క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్లు కొంత మెరుగ్గా ఉన్నా ఇప్పుడు హోం క్వారంటైన్లు ప్రమాదకరంగా మారాయి. వలసవెళ్లి వచ్చిన వారు ఎవరికివారు తమకు కరోనాలేదని, భావించి అందరితో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఇప్పుడు మిగిలిన వారి ఆరోగ్యానికి పరీక్షగా మారింది. 


మళ్లీ తెరుచుకున్న ప్రభుత్వ క్వారంటైన్లు

కరోనా ప్రబలితే వైరస్‌వ్యాప్తిని నియంత్రించేందుకు గాను.. అనుమానితులను ఉంచేందుకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదవగా 500మందికి పైగా ప్రేమరీ కాంటాక్టు కేసులను గుర్తించి వారిని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచారు. ఆ తర్వాత దశల వారీగా వారిని ఇళ్లకు పంపిన అధికారులు ఊపీరిపీల్చుకున్నారు. తాజాగా మహదేవపురంలో కరోనా కేసు నమోదవడంతో తిరిగి క్వారంటైన్‌ తలుపులు తెరిచారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ సుబ్బారావుని క్వారంటైన్‌ సెంటర్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించి.. 65మంది ప్రైమేరీ కాంటాక్టు కేసులను గుర్తించారు. వీరిలో 52మందిని సోమవారం ఖమ్మంలోని శారదా క్వారంటైన్‌కు తరలించారు.

Updated Date - 2020-05-19T18:15:26+05:30 IST