కరోనా వ్యాప్తి.. ప్రజల్లో భీతి.. వైరాలో ముగ్గురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-27T21:51:09+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలూరుపాడు మండలంలోని 24 పంచాయతీలలో భ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించడంతో పాటు, కొన్ని పంచాయతీలలో హైపోఫ్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. పడమటనర్సాపురంలో

కరోనా వ్యాప్తి.. ప్రజల్లో భీతి.. వైరాలో ముగ్గురికి పాజిటివ్‌

పడమటనర్సాపురం, అంజనాపురంలో 38 మంది హోం క్వారంటైన్‌

పాల్వంచ, అన్నపురెడ్డిపల్లిలో హోంక్వారంటైన్‌


ఖమ్మం/వైరా (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలూరుపాడు మండలంలోని 24 పంచాయతీలలో భ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించడంతో పాటు, కొన్ని పంచాయతీలలో హైపోఫ్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. పడమటనర్సాపురంలో ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, వెంగన్నపాలేనికి చెందిన  ఓ వ్యాపారి సతీమణి అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పడమటనర్సాపురంలోని వ్యాపారిని కలిసిన 32 మందిని హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భీతిల్లుతున్నారు. వెంగన్నపాలెం వ్యాపారి సతీమణి అనారోగ్యానికి గురి కావడంతో హైదారాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో వైద్య సిబ్బంది వ్యాపారి ఇంటిని సందర్శించారు. వివరాలను నమోదు చేసుకున్నారు. సతీమణి భర్తతో పాటు, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ మృతితో వెంగన్నపాలెంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పడమటనర్సాపురంలో కరోనా పాజిటీవ్‌ కేసు నమోదు కావడంతో వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. తహసీల్దార్‌ ప్రసాద్‌ పరిస్థితిని సమీక్షించారు. 


వైరాలో ముగ్గురికి పాజిటివ్

వైరా మునిసిపాలిటీ కౌన్సిలర్‌, వ్యాపార ప్రముఖుడు కూడా అయిన ఒకరితోపాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శనివారం ఖమ్మంలో కరోనా వైరస్‌ పరీక్ష చేయించుకున్న కౌన్సిలర్‌కు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ఆదివారం నిర్థారణ అయింది. వైరాలోని బస్టాండ్‌ సమీపంలోని ఓ ఫొటోగ్రాఫర్‌(ఎలక్ర్టానిక్‌ మీడియా విలేకరి)కి, బోడేపూడి కాలనీలోని ఓ గృహిణికి ఖమ్మం, వైరాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. వీరంతా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు.


తపాలాశాఖలోనూ

తపాలాశాఖలోనూ కొవిడ్‌ -19 పాజిటివ్‌ ఆందోళన సిబ్బందిని వేధిస్తోంది. తపాలశాఖలో ఓ ఉన్నతస్థాయి అధికారికి ఇప్పటికే పాజిటివ్‌ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారి సెలవుపెట్టి రాజధానిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తరచుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యవేక్షించే ఆ అధికారికి ఎక్కడ పాజిటివ్‌ కాంటాక్ట్‌ వచ్చిందనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయన తో పాటు పర్యటనల్లో పాల్గొనే ఆయన స్థాయి (జిల్లా ఉన్నతస్థాయి రెండో అధికారి) అధికారికి కూడా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ జిల్లాకు చెందిన ఆయనకు జ్వరం, జలుబు, దగ్గుతో బాదపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఖమ్మంలో కొవిడ్‌ పరీక్షలకు అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. తపాల శాఖలో ఉన్నతాధికారులకే ఈపరిస్థితి ఉండడంతో కింది స్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 


అంజనాపురంలో ఆరుగురు హోంక్వారంటైన్‌

తల్లాడ మండలం అంజనాపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతని కాంటాక్టులో ఉన్న ఆరుగురిని వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం హోంక్వారంటైన్‌ చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్‌ వి.నవ్యకాంత్‌ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేశారు. 


కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో అన్నపురెడ్డిపల్లి మండలంలో ఆదివారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ మొదలైంది. ఈ సందర్భంగా  మండలంలోని మర్రిగూడెంలో తొలి కరోనా కేసు నమోదవడంతో శనివారం మండలాధికారులతో ప్రజాప్రతినిధలు సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న దుకాణాలను ఉదయం 10గంటల వరకు మాత్రమే తెరవాలని, ప్రతీ ఒక్కరు మాస్కులు దరించాలని, భౌతిక దూరం పా టించాలనే నిబంధనతో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు అదికారులు, ప్రజాప్రతినిఽధులు తెలిపారు. సమీక్షా సమావేశంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో రేవతి, ఎంపీపీ లలిత పాల్గొన్నారు.


పాల్వంచలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌ డౌన్‌

పాల్వంచ పట్టణంలో స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. పట్టణ పరిధిలోని ఇటీవల విస్తరిస్తున్న కరోనా నేపథ్యంలో వర్తక సంఘం పిలుపు మేరకు అన్ని వ్యాపార వర్గాలు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు మాత్రమే తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. 


ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు, కండ్రిక, తక్కెళ్లపాడులో శనివారం పాజిటివ్‌ కేసులు నమోదైన బాధితులకు సంబంధించి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనుల్లో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ఆదివారం వైద్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహించారు. బాధితులతో కాంటాక్టు ఉన్న వారందరూ హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జంగా పుల్లారెడ్డి, భూక్యా నాగమణి, కూరపాటి సుందరమ్మ, హెల్త్‌సూపర్‌వైజర్‌ రమణవల్లి, హెల్త్‌ అసిస్టెంట్లు శాయిరెడ్డి, సుధాకర్‌, ఏఎన్‌ఎంలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-27T21:51:09+05:30 IST