పోలీసు శాఖలో కరోనా కలవరం.. ఓ హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-22T19:03:35+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సందర్భంలో తమ కుటుంబాలను వదిలి.. తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా రోడ్లపై విధులు నిర్వర్తించిన పోలీసులను

పోలీసు శాఖలో కరోనా కలవరం.. ఓ హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌కు పాజిటివ్‌

విధుల్లో ఉంటూ పరీక్షలు చేయించుకున్న సిబ్బంది

ఆందోళన చెందుతున్న తోటి ఉద్యోగులు

వారికి సన్నిహితంగా ఉన్న వారికి నెగిటివ్‌ 


ఖమ్మం(ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సందర్భంలో తమ కుటుంబాలను వదిలి.. తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా రోడ్లపై విధులు నిర్వర్తించిన పోలీసులను కరోనా కలవర పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నా మహమ్మారి ఏవైపు నుంచి వచ్చి సోకుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. అయితే జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాలతో నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. ప్రజలతో పాటు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు, కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ అని నిర్ధారణవడంతో వారిని హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. అంతేకాదు అటు కుటుంబసభ్యులు, ఇటు వారు పనిచేస్తున్న స్టేషన్‌ సిబ్బంది, వారితో కాంటాక్టు అయినవారిని హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులుసూచించారు. 


అయితే రోజూ తమతో పాటే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో తోటి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే మిగతా సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్‌ రిపోర్టు రావడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసిన సమయంలో జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఎస్‌హెచ్‌వోలు రెండు రోజులకోసారి మీటింగ్‌ ఏర్పాటుచేసి సిబ్బంది, వారి కుటుంబసభ్యుల ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్జిన జాగ్రత్తలపై చర్చించారు. కానీ ఇటీవల అలాంటి చర్యలేవీ లేవు. కానీ తమ శాఖలోని ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో జిల్లా ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.  ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలని అధికారులను సీపీ ఆదేశించారు. దీంతో ఏసీపీలు, సీఐలు ఎప్పటికప్పుడు తమ సిబ్బంది ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. జాగ్రత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పోలీసుశాఖను కరోనా తాకిన నేపథ్యంలో జిల్లాలోని మిగిలిన పోలీసుస్టేషన్లలో, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2020-07-22T19:03:35+05:30 IST