కొవిడ్‌ @ 198... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజృంభణ

ABN , First Publish Date - 2020-08-11T20:51:46+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఇరుజిల్లాల్లో 198 మందికి పాజిటివ్‌ నిర్ధారణవగా.. ఇల్లెందుకు చెందిన ఓ బీజేపీ నేత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కొవిడ్‌ @ 198... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజృంభణ

ఇరు జిల్లాల్లో కరోనా విజృంభణ

ఖమ్మం జిల్లాలో 104, భద్రాద్రిలో 94మందికి లక్షణాలు

ఇల్లెందులో బీజేపీ నేత కన్నుమూత


(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఇరుజిల్లాల్లో 198 మందికి పాజిటివ్‌ నిర్ధారణవగా.. ఇల్లెందుకు చెందిన ఓ బీజేపీ నేత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఖమ్మం జిల్లాలో 326మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 104మందికి పాజిటివ్‌ వచ్చిందని, 217మంది కోలుకున్నారని జిల్లా వైద్యాధికారులు హెల్త్‌బులిటెన్‌లో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 94మందికి పాజిటివ్‌ వచ్చింది. ఖమ్మం జిల్లా వైరాలో అత్యధికంగా 22మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరిలో ఇద్దరు వైద్యశాఖ సిబ్బంది ఉన్నారు. మధిరలో 10 మందికి నిర్ధారణవగా వారిలో ఒకరు బ్యాంకు ఉద్యోగి ఉన్నారు. సత్తుపల్లిలో ఎనిమిది మందికి, ఎర్రుపాలెంలో ముగ్గురికి, చింతకాని మండలంలో ముగ్గురికి, కొణిజర్ల మండలంలో నలుగురికి, బోనకల్‌ మండలంలో ముగ్గురికి, కూసుమంచి మండలంలో ఆరుగురికి, నేలకొండలపల్లి మండలంలో ఏడుగురికి, ఖమ్మం రూరల్‌ మండలంలో ఆరుగురికి పాజిటివ్‌ నమోదైంది.


వీరు కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 32మంది కూడా కరోనా బారిన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం 94 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోనే 40కేసులు నమోదవగా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో 24పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పినపాక, కరకగూడెం, దమ్మపేట మండల కేంద్రాల్లో ఒక్కొక్క పాజిటివ్‌ కేసు నమోదవగా, అశ్వాపురంలో ఐదుగురికి, ఇల్లెందులో ఆరుగురికి, టేకులపల్లిలో ముగ్గురికి, అశ్వారావుపేటలో ఐదుగురికి, లక్ష్మీదేవిపల్లిలో ఇద్దరికి, బూర్గంపాడు మండలంలో ఆరుగురికి కొవిడ్‌ లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. ఇదిలా సుజాతనగర్‌ మండలంలో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. కరోనాతో బీజేపీ ఇల్లెందు నియోజకవర్గ ముఖ్య నాయకుడు(49) మృతిచెందారు. వారం రోజులుగా వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. అయితే భద్రాద్రి జిల్లా అధికారులు మాత్రం కరోనా వివరాలతో ఎలాంటి నివేదికను విడుదల చేయడం లేదు. దీంతో పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య, మృతి చెందుతున్న వారి వివరాల్లో గందరగోళం ఏర్పడుతోంది. 


జిల్లాలో ర్యాపిడ్‌ కిట్లకు కొరతలేదు: ‘ఆంధ్రజ్యోతి’తో భద్రాద్రి డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌ 

భద్రాద్రి జిల్లాలో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లకు కొరతలేదని జిల్లా వైద్యాధికారి భాస్కర్‌ నాయక్‌ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో 2,480 ర్యాపిడ్‌ ఆంటిజెన్‌ కిట్లను ఉపయోగించామని, ఇంకా జిల్లా కేంద్రంలో 3వేల కిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.  గడిచిన రెండు రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉండటం వల్ల ఆయా పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు అడిగిన కిట్లను సమకూర్చడానికి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు.

Updated Date - 2020-08-11T20:51:46+05:30 IST