కృష్ణాజలాల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా ఏకమవ్వాలి....

ABN , First Publish Date - 2020-06-06T10:38:40+05:30 IST

కృష్ణాజలాల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా ఏకం కావాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప గడిచిన ఆరేళ్లలో

కృష్ణాజలాల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా ఏకమవ్వాలి....

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయింది

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 


ఖమ్మం రూరల్‌/ముదిగొండ, జూన్‌ 5 : కృష్ణాజలాల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా ఏకం కావాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప గడిచిన ఆరేళ్లలో కేసీఆర్‌ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ఒక్కప్రాజెక్టు కూడా కట్టలేకపోయిందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్‌ మండలం గోళ్లపాడు, ముదిగొండ మండలం వెంకటాపురంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. శ్రీశైలం డ్యాంపై సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టునుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకు పోనుందని, ఫలితంగా నాగార్జునసాగర్‌ ఎడమకాలువకు నీరు రాదని భవిష్యత్‌లో ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అన్యాయం జరగబోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటే ఏపీ సీఎం జగన్‌కు, కేసీఆర్‌కు నీటిదోపిడీ ఒప్పందాలు ఉన్నట్టుందని అనుమానం కలుగుతోందన్నారు.


ఇప్పటివరకు తెలంగాణ రైతులకు సాగునీరు అందిస్తున్న సాగర్‌జలాలను ఈ ప్రభుత్వం రాకుండా చేస్తోందని, కనీసం పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నా ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో జరుగుతున్న పరిణామాలతో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సాగర్‌  నుండి చుక్కనీరు వచ్చేపరిస్థితి ఉండదని, తద్వారా ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టు ఎడారిగా మారుతుందన్నారు. ఖమ్మం ప్రజలు రాజకీయాలకతీతంగా సేవ్‌సాగర్‌ నినాదంతో సాగర్‌ జలాలను కాపాడుకునేందుకు  ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, రూరల్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు మద్ది వీరారెడ్డి, యరసాని శివశంకర్‌ రెడ్డి,  వెంకటరెడ్డి, కన్నేటి వెంకన్న, ముక్కాశేఖర్‌, బొడా వెంకన్న, శ్రీనివాస్‌ రెడ్డి, ముదిగొండ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌, మాజీ జడ్పీటీసీ మందడపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:38:40+05:30 IST