కార్పొరేషన్ పోరుకు కాంగ్రెస్ కసరత్తు
ABN , First Publish Date - 2020-10-04T09:32:23+05:30 IST
రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఎన్నికల కార్యచరణపై
జిల్లా నాయకులకు అధిష్ఠానం దిశానిర్ధేశం
హాజరైన ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, సీఎల్పీ నేత భట్టి
ఖమ్మం, అక్టోబరు 3(ప్రతినిధి): రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఎన్నికల కార్యచరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల అంతర్గత సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కుసుమకుమార్ తదితరులు హాజరై ఎన్నికలపై చర్చించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డివిజన్ల వారీగా కమిటీలు వేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరిస్థితి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయింపులు, ఇతర సమస్యలపైనా ప్రజలకు అవగాహన కలిపించి సమస్యల పరిష్కారానికి కార్యక్రమాలు రూపొందించాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, సీఎల్పీ నేత భట్టి నాయకులకు సూచించారు.
డివిజన్ల వారీగా సంస్థాగత కమిటీలు ఏర్పాటుచేయాలని కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం దక్కేలా ఇప్పటినుంచే కార్యచరణ చేపట్టాలన్నారు. అలాగే ప్రతీ డివిజన్ వారీగా పర్యటన కార్యక్రమాలు రూపొందించాలని, డివిజన్ కమిటీలను త్వరగా ప్రకటించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా తమ అభిప్రాయాలను నేతలకు వివరించారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు జావీద్, కార్పొరేటర్లు దీపక్‌దౌదరి, తిలక్ తమ అభిప్రాయలను వినిపించారు. సంస్థాగతంగా బలంగా ఉంటేనే ఎన్నికలు ఎదుర్కొనే వీలుంటుందని, అధికార పార్టీకి ప్రతిడివిజన్‌లో కేడర్ బలం ఉందని దానికి తగిన విధంగా కాంగ్రెస్ కేడర్‌ను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉదని వారు అధిష్టానానికి సూచించారు.