నేడు కాంగ్రెస్ నిరుద్యోగ శంఖారావం
ABN , First Publish Date - 2020-12-07T04:54:20+05:30 IST
నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కమిటీ, నగర కమిటీ అధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని 50డివిజన్లలో నిరుద్యోగశంఖారావ దీక్షలను నిర్వహిస్తున్నారు.

ఖమ్మంలోని 50డివిజన్లలో దీక్షలకు పిలుపు
ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు 6: నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కమిటీ, నగర కమిటీ అధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని 50డివిజన్లలో నిరుద్యోగశంఖారావ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అధ్వర్యంలో ఇప్పటికే 50డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు ఎండీ జావీద్, కార్పొరేటర్లు నాగండ్ల దీపక్‌చౌదరి, యర్రం బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నర్సింహారావు ప్రాంతాల వారీగా దీక్షల బాధ్యతలను తీసుకున్నారు. ఈ దీక్షలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు సందర్శిస్తారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడు తూ... తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. తర్వాత ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని, ఒక్క నిరుద్యో గికి కూడా భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగుల గోడు ప్రభుత్వానికి తెలిపేందుకు తాము సోమవారం ఖమ్మంనగరంలోని 50డివిజన్లలో నిరుద్యోగ శంఖారావ దీక్షలను నిర్వహిస్తున్నామన్నారు.