పాలేరు రొయ్యకు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-05-30T10:31:45+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పాలేరు రొయ్యపైనా పడింది. ఇక్కడి మంచినీటి రొయ్యలకు విదేశాల్లో

పాలేరు రొయ్యకు కరోనా దెబ్బ

విదేశాలకు ఎగుమతిపై ఆందోళన 

స్థానిక మత్స్యకారులతో తీవ్ర ప్రభావం

జలాశయమే ఆధారంగా జీవిస్తున్న వెయ్యి కుటుంబాలు


కూసుమంచి, మే 29: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పాలేరు రొయ్యపైనా పడింది. ఇక్కడి మంచినీటి రొయ్యలకు విదేశాల్లో డిమాండ్‌ ఉంది. ప్రతీఏటా చైనా, జపాన్‌తో పాటు అరబ్‌ దేశాలకు ఎగుమతవుతుంటాయి. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో.. ఆ ప్రభావం స్థానిక మత్స్యకారులపై పడనుంది. ఖమ్మంజిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయాన్ని నమ్ముకొని దాదాపు వెయ్యి గంగపుత్ర కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. ప్రతీ ఏటా వారంతా ఈ జలాశయాన్ని ఆనుకొని ఉన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చెందిన గ్రామాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని రొయ్యలు, చేపల వేటకు సిద్ధమవుతుంటారు.


ఈ క్రమంలో సుమారు మూడు నెలలు సాగే వేటకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. ప్రతీ కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు ఈ షికారు పనుల్లో నిమగ్నమవుతుంటారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా వేటకు వెళ్తుండటం గమనార్హం. అంతేకాదు రొయ్యలు, చేపల వేటకు అనుకూలమైన సామగ్రిని సొంతంగానే తయారు చేసుకుంటారు. రొయ్యలు పట్టే బుట్టలు, చేపల వలలు, నీటిపై ప్రయాణించేందుకు అవసరమైన తెప్పలు, తెడ్లు సమకూర్చుకుంటారు. సీజన్‌ ప్రారంభానికి నెల రోజుల ముందునుంచి అందరూ ఈ పనులను కలిసికట్టుగా చేసుకుంటారు. దీనికి సుమారు రూ.30వేల వరకు వెచ్చిస్తారు. పాలేరు జలాశయం నుంచి నీటివిడుదల నిలిపివేయగానే ఏటా వేట ప్రారంభించడం జరుగుతుంది.


ఏటా రూ.5కోట్ల వ్యాపారం

పాలేరు జలాశయం ఆధారంగా ఏటా సుమారు రూ.5కోట్లకు పైగానే రొయ్యల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ వేటాడిన చేపలను మత్స్యకారులు ఓ దళారీకి విక్రయిస్తుంటారు. ఏ గ్రేడ్‌ రొయ్యలకు రూ.230, బి గ్రేడ్‌ రొయ్యలను రూ.130చొప్పున విక్రయిస్తుంటారు. ఆ దళారీ ఏపీలోని ఒంగోలు కేంద్రంగా చైనా, జపాన్‌తో పాటు అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, అంతర్జాతీ ఎగుమతులు నిలిపేయడంతో రొయ్యల ఎగుమతి కూడా అసాధ్యమని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఏడాది షికారు చేస్తే డిమాండ్‌ తగ్గి.. ధర కూడా పడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కరోనాతో కుదేలయ్యాం: ఏడుకొండలు, మత్స్యసొసైటీ కార్యదర్శి, నాయకన్‌గూడెం

కరోనా వైరస్‌ కారణంగా కుదేలయ్యాం. రెండునెలలు ఆలస్యంగా రొయ్యల షికారు ప్రారంభమవుతుంది. ఇప్పటికే పనులు, ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలి. చేపలు, రొయ్యల ఎగుమతులకు అవకాశం ఉంటే మాకు కష్టాలు తప్పినట్టే. లేదంటే డిమాండ్‌ తగ్గి ధర పలకక మేం నష్టపోవాల్సి వస్తుంది. 


Updated Date - 2020-05-30T10:31:45+05:30 IST