గిరిజన గ్రామంలో కలెక్టర్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-05-09T10:24:45+05:30 IST

అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదివాసీ మారుమూల గ్రామం అది.

గిరిజన గ్రామంలో కలెక్టర్‌ పర్యటన

ఆదివాసీల సమస్యలపై ఆరా 

రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు హామీ 


కొత్తగూడెం, మే 8 :  అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదివాసీ మారుమూల గ్రామం అది. అక్కడికి వాహనాలు వెళ్లేందుకు రహదారి సౌకర్యం అంతంత మాత్రం. అయితేనేం వారి సమస్యలు పరిష్కారానికి రాళ్లు రప్పలు, గుంతల రహదారి అడ్డురాలేదు ఆయనకు. దాదాపు నాలుగు కిలోమీటర్లు పోలీసు వాహనంలో ప్రయాణించి అతికష్టం మీద ఆ గ్రామానికి చేరుకున్నారు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి. గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చొని, దాదాపు మూడు గంటలపాటు వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఇంటింటికి వెళ్లి వారి జీవన స్థితిగతులను పరిశీలించారు.


చీకటిగా ఉన్న ఆ గుడిసెల్లో సెల్‌ఫోన్‌ లైట్‌ వేసి ఆ వెలుగులో వారికున్న సదుపాయాలు తెలుసుకున్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడేనికి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీ పరిధిలోని జగ్గారం ఆదివాసీ గ్రామానికి శుక్రవారం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి వెళ్లారు. అయితే తొలుత కలెక్టర్‌తో మాట్లాడాలంటే భయపడిన ఆదివాసీలతో మాటలు కలిపిన ఆయన గ్రామంలో నీటిసమస్య, ట్యాంకులు, కుళాయిల ఏర్పాటు, అప్పటి వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా, నెల నెలా ఆరోగ్య పరీక్షలు, అంగన్‌వాడీ నిర్వహణ, మాతా శిశు సంరక్షణ, వంట గ్యాస్‌ తదితర సమస్యలు తెలుసుకుని అన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


కట్టెలపొయ్యిలపై వంట చేయడం వల్ల ఆ పొగకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశముందని ప్రతీ కుటుంబానికి గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరుకు ప్రతిపాదనలు రూపొందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసిన ఆయన.. ఉపాధి హామీ పథకంలో కింద పని కల్పనకు జాబ్‌ కార్డులు జారీ చేయాలని డీఆర్‌డీఏ పీడీకి సూచించారు. అటవీ  ప్రాంతమైనందున.. విద్యుత్‌ సరఫరాకు అనుమతులు లభించని కారణంగా  ప్రత్యేకంగా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేస్తామన్నారు.


అలాగే గుడిసెల స్థానంలో శాశ్వత నివాసం కల్పించేందుకు రెండు పడక గదుల ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. రేషన్‌ కార్డుల మంజూరు, బియ్యం పంపిణీ, ఆధార్‌ కార్డుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ మధుసూధనరాజు, డీపీవో ఆశాలత, ఆర్డీవో స్వర్ణలత, తహసీల్దార్‌ భవాని, ఎంపీడీవో రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T10:24:45+05:30 IST