సునిశిత పరిశీలన

ABN , First Publish Date - 2020-03-25T11:23:56+05:30 IST

ప్రజలు కరోనా భారిన పడకుండా తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు ఆయా జిల్లాల్లో దగ్గరుండి సునిశితంగా పరిశీలిస్తున్నారు.

సునిశిత పరిశీలన

ప్రధాన వీధులను సందర్శించి  లాక్‌డౌన్‌ను పరిశీలించిన  కలెక్టర్లు కర్ణన్‌, ఎంవీ రెడ్డి


ఖమ్మం  కలెక్టరేట్‌/ కొత్తగూడెం కలెక్టరేట్‌ /ఖమ్మం  క్రైం, మార్చి 24: ప్రజలు కరోనా భారిన పడకుండా తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు ఆయా జిల్లాల్లో దగ్గరుండి  సునిశితంగా పరిశీలిస్తున్నారు. లాక్‌డౌన్‌ను విధిగా అంతా పాటించాలని మంగళవారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కోరారు. లాక్‌ డౌన్‌ సందర్భంగా జీవో నెంబర్‌ 46 ను అమలు తీరులో భాగంగా ఆయన గత రెండు రోజులుగా తన కారును తానే స్వయంగా నడుపుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వచ్చి కొద్దిసేపు కార్యాలయంలో ఉన్నారు. ఆతర్వాత ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి ఐసోలేషన్‌లో పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. అటుపిమ్మట నగరంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ ను స్వయంగా పరిశీలించారు. మయూరిసెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, జడ్పీ సెంటర్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మెడికల్‌ దుకాణాలు, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. 


ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై ఆగ్రహం

  అత్యవసరమైతేనే తప్ప వాహనాలలో తిరగొద్దని ప్రకటించినా ఎందుకు బయటకు వచ్చారంటూ  భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌లోని మహాలక్ష్మి మెడికల్‌ షాపును ఆకస్మిక తనికి చేసిన కలెక్టర్‌ పరిశుభ్రత పాటించలేదని షాపు యజమానికి రూ.10వేలు ఫైన్‌ విధించారు. కేఎ్‌సఎం పెట్రోల్‌ బంక్‌ వద్ద గల యుగంధర్‌ డాబాలో రోటీలు తయారుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గమనించిన కలెక్టర్‌  రూ.5వేలు ఫైన్‌ విధించారు. కొత్తగూడెం, కెఎ్‌సఎం, జగన్నాధపురం, పాల్వంచ ప్రాంతాల్లో  ఆకస్మికంగా పర్యటించారు. 


లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన సీపీ

 లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంగళవారం ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో  కారును తానే స్వయంగా నడుపుతు పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు.  సీపీ తన గన్‌మెన్‌ను కూడా కారులో తీసుకెళ్లకుండా పక్కన ద్విచక్రవాహనాలపై రమ్మని సిబ్బందికి సూచించారు. లాక్‌డౌన్‌పై వాహనదారులు రోడ్లపైకి వస్తుండడంత వారిని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.  అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌లతో కలిసి మంగళవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కర్ఫ్యూను పరివేక్షించారు. ఖిల్లా బజార్‌, శుక్రవారపేట, రిక్కాబజార్‌, ముస్తాఫనగర్‌, మమతరోడ్‌, ఇల్లెందు క్రాస్‌ రోడ్ల, మమూరి సెంటర్‌లో పర్యాటించి రోడ్లపై ప్రజలు వాహనాలతో రావడంతో వారికి అనవసరంగా తిరగకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. 

Updated Date - 2020-03-25T11:23:56+05:30 IST