రహదారి నిర్మాణం అధ్వానం.. కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-27T04:00:41+05:30 IST

సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం సమీపంలో ఒక సీసీ రహదారి నిర్మించారు.

రహదారి నిర్మాణం అధ్వానం.. కలెక్టర్‌ ఆగ్రహం

నగరపాలక సంస్థ డీఈ, ఏఈల సస్పెండ్‌ చేయాలని ఆదేశం 

ఖమ్మం కార్పొరేషన్‌, డిసెంబరు26: సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం సమీపంలో ఒక సీసీ రహదారి నిర్మించారు. అయితే సరైన పర్యవేక్షణ లేక పోవటంతో రహదారి నిర్మాణం అధ్వానంగా మారింది. దీనిని చూసిన కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ సీరియస్‌ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నగరపాలక సంస్థ డీఈ ధరణికుమార్‌, ఏఈ సతీష్‌పై చర్య తీసుకోవాలని ఆదేశించారు ఆ మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఫైల్‌ తయారు చేసి శనివారం కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్‌ డీఈ, ఏఈలను సస్పెండ్‌ చేయనున్నట్లు తెలిసింది.

పర్యవేక్షణ లేక అడ్డగోలుగా పనులు

నగరంలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నా, అధికారుల పర్యవేక్షణ ఉండటంలేదు. దీంతో కాంట్రాక్టర్లు అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. రహదారులు, డ్రెయిన్లు, డివైడర్ల నిర్మాణం చూస్తుంటే ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో అర్ధం అవుతుంది. ఇసుక, కంకర, సిమెంట్‌ సమపాళ్లలో కలపక పోవటం, నిర్మాణానికి క్యూరింగ్‌ చేయకపోవటం చేస్తున్నారు. దీంతో అవి త్వరగానే శధిలమవుతున్నాయి. నిర్మించిన కొన్ని రోజులకే డివైడర్లకు పగుళ్లు రావటం, రహదారులపై గుంతలు పడటం జరుగుతున్నాయి.

రహదారి నిర్మాణంపై కలెక్టర్‌ సీరియస్‌

మయూరి సెంటర్‌ ఫ్లైఓవర్‌ కిందుగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లేదారి నుంచి ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం మీదుగా జూబ్లీక్లబ్‌ వరకు ఇటీవల సీసీ రహదారి నిర్మాణం చేపట్టారు. అయితే సదరు నిర్మాణం నాసిరకంగా ఉంది. శుక్రవారం కలెక్టర్‌ కర్ణన్‌ ఆ రహదారి గుండా వెళ్లేటప్పుడు నిర్మాణం నాసిరకంగా ఉండటం, ప్రణాళిక లేకుండా ఉండటంతో పాటు, రహదారి నిర్మించిన తరువాత వ్యర్థాలను అలాగే వదిలేయటం గమనించారు. ఆ డివిజన్‌కు సంబంధించిన నగరపాలక సంస్థ డీఈ, ఏఈలపై చర్య తీసుకోవాలని అసిస్టెంట్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఆ మేరకు డీఈ ధరణికుమార్‌, ఏఈ సతీష్‌ను సస్పెండ్‌కు సిఫారసు చేస్తూ నగరపాలక సంస్థ  ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం కలెక్టర్‌కు శనివారం ఫైల్‌ పంపారు. కలెక్టర్‌ సంతకం చేస్తే ఆ ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు పడుతుంది. 

Updated Date - 2020-12-27T04:00:41+05:30 IST