‘బూజు’ వదిలించండి !
ABN , First Publish Date - 2020-12-07T04:53:40+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరునెలల నుంచి చౌకధరల దుకాణాల్లో మూలుగుతూ బూజు(నిల్వ)పట్టిన కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

పాడైపోయిన కందిపప్పు
నిల్వ కందిపప్పు అంగన్‌వాడీ కేంద్రాలకు..
సరఫరాకు పౌరసరఫరాలశాఖ ఆదేశం
నాణ్యత లేదని నివేదించిన అంగన్‌వాడీ టీచర్లు
వైరా, డిసెంబరు 6: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరునెలల నుంచి చౌకధరల దుకాణాల్లో మూలుగుతూ బూజు(నిల్వ)పట్టిన కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద పంపిణీ చేసేందుకు రేషన్‌షాపుల్లో ఉన్న కందిపప్పును అంగన్‌వాడీలకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశిస్తూ కమిషనర్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లందరూ తమ సమీపంలో ఉన్న రేషన్‌దుకాణాలకు వెళ్లి అక్కడ నిల్వ ఉన్న కందిపప్పు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లు తమ సమీపంలోని రేషన్‌దుకాణాలకు వెళ్లి అక్కడ నిల్వ ఉన్న కందిపప్పును పరిశీలించారు. దాదాపు 99శాతం రేషన్‌దుకాణాల్లో ఆరునెలల నుంచి నిల్వ ఉన్న కందిపప్పు నాణ్యత లేదని అది తినడానికి పనికిరాదని, బూజుపట్టి తుట్టెలతో ఉందని తమకు వచ్చిన ఫార్మెట్‌లో ఐసీడీఎస్ అధికారులకు అంగన్‌వాడీ టీచర్లు నివేదించినట్లు సమాచారం. ‘రేషన్ పప్పునకు బూజు’ అనే శీర్షికన గతనెల మూడోతేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ఒక కథనం ప్రచురితమైంది. ఇది జరిగిన నెల తర్వాత బూజుపట్టి పాడైపోయిన కందిపప్పును ఇప్పుడు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం కింద వదిలించుకొనేందుకు పౌరసరఫరాలశాఖ ఆదేశాలు ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన రూ.కోట్ల విలువైన వందలాది క్వింటాళ్ల కందిపప్పు తుట్టెలు కట్టి బూజు పట్టింది. ఆరునెలలుగా ఈ కందిపప్పు రేషన్‌షాపుల్లోనే పాడైపోయింది. కరోనా సమయంలో కార్డుదారులకు ఒక కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కందిపప్పును మేలో విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో జూన్, జూలై నెలల్లో జిల్లాలోని 669రేషన్‌షాపుల పరిధిలో ఉన్న 4,04,966కార్డుదారులకు కందిపప్పును ప్రభుత్వం సరఫరా చేసింది. జూలై వరకు ఈ కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి ఉచిత కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. రేషన్‌షాపుల్లో ఉన్న కందిపప్పు కార్డుదారులందరికీ సరిపోదనే కారణంతో ఆగస్టు నుంచి పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఇప్పటికీ అధికార యంత్రాగం మేల్కొని కందిపప్పును గర్భిణీ, బాలింత మహిళలకు పౌష్టికాహారం కింద సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో ఎందుకూ పనికిరాకుండా పోయిన కందిపప్పును ఎలాగైనా అంగన్‌వాడీలకు అంటగట్టేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమైంది. మొత్తంగా పౌరసరఫరాలశాఖ నిర్లక్ష్యం వల్ల పేదలకు అందాల్సిన కోట్లాదిరూపాయల విలువైన వందలాది క్వింటాళ్ల కందిపప్పు పనికిరాకుండా పోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాణ్యత లేని కందిపప్పును అంగన్‌వాడీలు తీసుకుంటున్నాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.