భద్రగిరిలో పొదుపు మంత్రం
ABN , First Publish Date - 2020-10-07T05:36:42+05:30 IST
కరోనా ప్రభావం భద్రాద్రి రామయ్య ఆదాయ వనరులపై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్ తదనంతర పరిణామాలతో ఆలయానికి భక్తుల రాక

రామాలయ ఆదాయాల పెంపుపై దృష్టి..
ఖర్చుల మదింపునకు కసరత్తు
పరిస్థితులు అనుకూలిస్తే శ్రీరామరథం ద్వారా విస్తృత ప్రచారం
భద్రాచలం, అక్టోబరు 6: కరోనా ప్రభావం భద్రాద్రి రామయ్య ఆదాయ వనరులపై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్ తదనంతర పరిణామాలతో ఆలయానికి భక్తుల రాక అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో దేవస్థానం అధికారులు పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ఒక వైపు ఉన్న వనరులతో పరిస్థితులకు అనుగుణంగా ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చో దృష్టి సారిస్తూనే మరోవైపు ఖర్చులను సైతం మదింపు చేస్తున్నారు. ప్రతినెల దేవస్థానంలో ఉద్యోగుల జీతాల చెల్లింపు దేవస్థానానికి తలకు మించిన భారమవుతోంది. అలాగే విద్యుత్ చార్జీలు, నిర్వహణ ఖర్చులు వివిధ రూపాల్లో ప్రతినెల రూ.1.20 కోట్ల వరకు ఖర్చులు ఉంటున్నాయి.
దీంతో వాటిని తగ్గించుకోవడంపై అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టగా కరోనా వైరస్ ప్రభావంతో భక్తులు అధిక సంఖ్యలో ఇప్పట్లో వచ్చే పరిస్థితులు లేకపోవడంతో అందుకు అనుగుణంగా క్రమక్రమంగా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతీనెల ఉద్యోగులకు, సిబ్బందికి జీతాల చెల్లింపునకు రూ.95లక్షలు చెల్లిస్తుండగా విద్యుత్ బిల్లుల కోసం రూ.8లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇతరత్రా ఖర్చుల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చులు అవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భద్రాద్రి రామయ్యకు ఉన్న భూముల్లో రావాల్సిన డ్యామేజీ చార్జీలు పూర్తిస్థాయిలో గత రెండేళ్ల నుంచి రాకపోవడం కూడా దేవస్థానంకు కొంత ఇబ్బందికరంగానే మారింది. కాగా పరిస్థితులు అనుకూలించిన నాటినుంచి భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీరామ ప్రచార రథాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రచారం చేయనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆదాయాల పెంపు ఖర్చుల తగ్గింపుపై మరింత దృష్టిసారించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి
భద్రాద్రి దేవస్థానానికి ఆదాయ వనరులను ఉన్న పరిస్థితుల్లో ఏవిధంగా పెంపొందించుకోవాలనే విషయంపై దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీయాప్ పోలియో, మీసేవా వెబ్‌సైట్ ద్వారా భక్తుల నుంచి విరాళాల సేకరణకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఆర్జిత సేవలు భక్తుల సమక్షంలో పరిమిత సంఖ్యలో ప్రారంభం కావడంతో ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భద్రాద్రి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1347.27 ఎకరాల భూమిలో 1150 ఎకరాలు ఆక్రమణలో ఉంది. 725 ఎకరాల భూమిలో డ్యామేజీ చార్జీల పేరిట రూ.22 లక్షలు వసూలు కావాల్సి ఉండగా వాటిపై సైతం అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇప్పటికీ రెండు లక్షలు వసూలు చేయగా పూర్తిస్థాయిలో ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఖర్చుల మదింపుపై దృష్టి
దేవస్థానం అధికారులు ఖర్చుల మదింపుపై సైతం ఇప్పటికే దృష్టి నిలిపారు. జీతాల చెల్లింపు కోసం ప్రతినెల రూ.95 లక్షలు వెచ్చిస్తున్నారు. దీంతో అవుట్‌సోర్సింగ్, హౌస్‌కీపింగ్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న 50మందిని ప్రస్తుతానికి విధుల నుంచి తొలగించారు. ఈ చర్యతో రూ.5.50 లక్షల వరకు భారం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ప్రతినెల సాధారణ సమయంలో రూ.8లక్షలు వెచ్చిస్తుండగా ప్రస్తుతం రూ.4 లక్షల మేరకే ఉంటోంది. అదేవిధంగా కోవిడ్ నిబంధనల క్రమంలో ఉత్సవాలు సైతం బహిరంగంగా నిర్వహించకపోవడంతో ఖర్చుల భారం సైతం కొంత తగ్గింది. ఇదే పరిస్థితి మరో ఆరు నెలల వరకు ఉండే క్రమంలో మరింత పొదుపుగా చర్యలు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు.
ఇప్పటికే దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది జీతాల చెల్లింపు, పలువురు కాంట్రాక్టర్లకు చెల్లింపులకు రూ.6కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ల ఉపసంహరణకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు ఇవ్వడంతో వాటి ఆధారంగా చెల్లింపులు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవస్థానానికి ఆదాయం వస్తేనే ఉద్యోగుల సిబ్బంది జీతాల చెల్లింపు సాధ్యమయ్యే పరిస్థితుల్లో ఆదాయ వనరుల పెంపుపై మరింత దృష్టిని నిలిపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.