భద్రాద్రి రామయ్యకే టోకరా

ABN , First Publish Date - 2020-06-26T10:20:39+05:30 IST

సైబర్‌ నేరగాళ్ల కన్ను ఏకంగా భద్రాద్రి రామయ్య దేవస్థానంపైనే పడింది. కరోనా నేపధ్యంలో ఆర్జిత సేవలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేపధ్యంలో

భద్రాద్రి రామయ్యకే టోకరా

దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించిన పాలకుర్తి వాసి

ఆన్‌లైన్‌ పూజల పేరుతో సొమ్ము వసూళ్లు 

వరంగల్‌ భక్తుడికి రశీదు రాకపోవడంతో గుట్టురట్టు

పోలీసులకు ఫిర్యాదు చేశాం: ఈవో జి.నర్సింహులు


భద్రాచలం, జూన్‌ 25: సైబర్‌ నేరగాళ్ల కన్ను ఏకంగా భద్రాద్రి రామయ్య దేవస్థానంపైనే పడింది.  కరోనా నేపధ్యంలో ఆర్జిత సేవలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేపధ్యంలో భద్రాద్రి రామాలయం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి ఆర్జిత సేవల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు ఓ మాయగాడు. ఈ వెబ్‌సైట్‌లో పూజకోసం ఓ భక్తుడు సొమ్ము చెల్లించగా అతడికి రసీదు రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అది నకిలీవెబ్‌సైట్‌ అని తేలింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన జె.శ్రీకాంత్‌ అనే యువకుడు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ తయారు చేసి తన పర్సనల్‌ అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యేలా వెబ్‌సైట్‌ రూపొందించాడు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన కుంచాల సదా విజయ్‌కుమార్‌ అనే భక్తుడు భద్రాచలం రామాలయంలో పూజల కోసం ఈ వెబ్‌సైట్‌ ద్వారా రూ.516 నగదును ఆన్‌లైన్‌లో ఉన్న ఫోన్‌ నెంబరుకు గూగుల్‌పే ద్వారా చెల్లించాడు.


కానీ అతడికి ఎటువంటి రసీదులు అందకపోవడంతో అనుమానం వచ్చి విచారణ చేయగా సదరు అకౌంట్‌ జనగామ జిల్లా పాలకుర్తి ఎస్‌బీఐ శాఖలో ఉందని తేలడంతో బాధితుడు తనకు తెలిసిన పోలీసుల ద్వారా విషయాన్ని పాలకుర్తి పోలీసులకు తెలియజేయగా పోలీసులు మోసానికి పాల్పడిన సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదే విషయాన్ని భద్రాచలం దేవస్థానం ఈవో దృష్టికి తీసుకురాగా వివరాలతో పోలీసులు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఆలయ సిబ్బందికి సూచించారు. దీంతో అటు భద్రాచలం, ఇటు పాలకుర్తి పోలీసులు యువకుడి అకౌంట్‌లో ఇంకా ఎంతమంది భక్తులు నగదు జమ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-06-26T10:20:39+05:30 IST