శ్రీ గోకుల రామానికి శ్రీకారం
ABN , First Publish Date - 2020-11-21T06:21:11+05:30 IST
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థాన భూముల్లో నిర్మించతలపెట్టిన శ్రీగోకుల రామానికి శుక్రవారం దేవస్థానం ఈవో బి.శివాజీ, వైదిక పరిపాలన సిబ్బంది....

గోశాల పనులకు భూమిపూజ చేసిన ఈవో
ఏపీలోని పురుషోత్తపట్నం భూముల్లో నిర్మాణానికి కసరత్తు
104 ఎకరాల్లో రూ.10కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదనలు
భద్రాచలం, నవంబరు 20 : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థాన భూముల్లో నిర్మించతలపెట్టిన శ్రీగోకుల రామానికి శుక్రవారం దేవస్థానం ఈవో బి.శివాజీ, వైదిక పరిపాలన సిబ్బంది భూమిపూజ నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానానికి చెందిన 104 ఎకరాల్లో నిర్మించాలనుకున్న ఈ గోశాలకు రూ.10కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరవలేదు. కానీ చెన్నైకు చెందిన ఓ భక్తుడు శ్రీగోకులరామంలో ఒక గోశాల నిర్మాణానికి రూ.14లక్షలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం వైదిక సిబ్బంది విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, భూమిపూజ తదితర ప్రత్యేక పూజలను నిర్వహించగా కార్యక్రమంలో దేవస్థానం ఈవో శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్, పర్యవేక్షకులు భవానీ రామకృష్ణారావు, ఇంజనీరింగ్ విభాగం డీఈ వి.రవీంద్రనాథ్, ఏఈ నర్సింహరాజు, ముఖ్య అర్చకుడు శ్రవణ్‌కుమారాచార్యులు, అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, వేద పండితులు రవికుమార్ శర్మ, నర్సింహాచార్యులు పాల్గొన్నారు.
శ్రీగోకుల రామం విశిష్టత ఇది....
భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకరంగా చేపడుతున్న శ్రీగోకులరామానికి ఎంతో విశిష్టత ఉంది. మొత్తం 104 ఎకరాల్లో శ్రీగోకులరామం నిర్మించాలని తలపెట్టగా ఇందులో 12 గోశాలలు, నక్షత్రవనం, రాశివనం, నవగ్రహ వనం, శ్రీకృష్ణుడి విగ్రహం, పిల్లల పార్కు, కోనేరు, బోటింగ్, భక్తులు రాత్రిపూట బస చేసేందుకు కుటీరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రూ.కోట్లతో ముడిపడి ఉన్న అంశం కావడంతో గతంలో ప్రభుత్వానికి రూ.10కోట్ల ప్రతిపాదనలు పంపగా.. నిధులు మంజూరవకపోవడంతో ఏడాదిన్నరగా ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ భక్తుడు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు రావడంతో దేవస్థానం అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు.
మరోసారి ద్వారక తిరుమల గోశాల పరిశీలనకు..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన గోశాలను పరిశీలించేందుకు భద్రాద్రి దేవస్థానం అధికారులు మరోమారు ద్వారక తిరుమల వెళ్లనున్నారు. గతంలోనూ ఓ సారి అక్కడ గోశాల నిర్వహణ తీరును పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు అక్కడ గోశాల నిర్మాణం, నిర్వహణ తీరును పరిశీలించారు. మరోసారి అక్కడికి వెళ్లి.. శ్రీగోకులరామాన్ని దానికంటే మరింత ఉన్నతస్థాయిలో నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం త్వరలో ఒక బృందం ద్వారక తిరుమల వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి రామాలయాన్ని దర్శించేందుకు వచ్చే భక్తులు దర్శించుకునేలా శ్రీగోకుల రామాన్ని కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దాతలు తమవంతు సహకారం అందించాలని వారు కోరుతున్నారు.
30న రామాలయంలో కృత్తికా దీపోత్సవం
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30న కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. 30న ఉదయం స్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, హవనం నిర్వహించనున్నారు. సాయంత్రం పూర్ణాహుతి, దీపోత్సవం, చొక్కాసుర దహనం, తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 30న నిర్వహించే నిత్యకల్యాణాన్ని నిలిపివేసినట్టు ఈవో పేర్కొన్నారు.