హెపటైటిస్‌తో జర భద్రం.. చాపకింద నీరులా వ్యాపిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2020-07-28T21:08:01+05:30 IST

దీర్ఘకాలిక వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది హెపటైటీస్‌ వ్యాధి. దీనిని హెపటైటీస్‌ బీ, సీగా పిలుస్తారు. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధిని గుర్తించి మందులు వాడితే త్వరగా వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు

హెపటైటిస్‌తో  జర భద్రం.. చాపకింద నీరులా వ్యాపిస్తున్న వైరస్‌

కాలేయంపై తీవ్ర ప్రభావంతో అస్వస్థత

ఖమ్మం, భద్రాద్రిలో 3-5శాతం మంది బాధితులు

రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరస్‌ తీవ్రత అధికం


ఖమ్మం (ఆంధ్రజ్యోతి):  దీర్ఘకాలిక వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది హెపటైటీస్‌ వ్యాధి. దీనిని హెపటైటీస్‌ బీ, సీగా పిలుస్తారు. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధిని గుర్తించి మందులు వాడితే త్వరగా వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటంతో చాపకింద నీరులా హెపటైటిస్‌ బీ వ్యాధి వ్యాప్తిచెందుతోంది. వైద్యశాఖ గణాంకాల మేరకు రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హెపటైటీస్‌ వైరస్‌ అధికంగా ఉందని లెక్కలు చెపుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూటికి 3నుంచి 5శాతం వరకు ప్రజలకు హెపటైటిస్‌ వైరస్‌ వ్యాప్తిచెందిందని వైద్యులు పేర్కొంటున్నారు.  


వయస్సుతో సంబంధం లేని వైరస్‌

హెపటైటిస్‌ వయస్సుతో సంబంధం లేకుండా వ్యాప్తి చెందుతోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.  హెపటైటిస్‌ ఏ, ఈ ద్వారా కామెర్ల వ్యాధి వస్తుంది. అయితే కామెర్లు వారం రోజులు పాటు ఉండి వాటంతట ఆవే తగ్గిపోతాయి హెపటైటిస్‌ బీ వైరస్‌ దీర్ఘకాలిక లివర్‌ సంబంధిత వ్యాధులను కలిగొస్తుండగా, లీవర్‌ గడ్డకట్టటం, లివర్‌ కేన్సర్‌కు ‘సీ’ కారణమవుతుంది.


హెపటైటిస్‌ వ్యాధి లక్షణాలు

ఆకలి మందగించడం, అలసట, నీరసంగా ఉండటం, కడుపులో నొప్పి

వాంతులు, విరోచనాలు, కామెర్లు, కాళ్లు పొట్ట వాపు నీరు చేరటం, రక్తపు వాంతులు, నల్ల రంగులో విరోచనాలు రాత్రి సమయంలో సరిగా నిద్రపట్టకపోవటం.


అవగాహన కల్పించేందుకే హెపటైటిస్‌ డే

ప్రమాదకరమైన హెపటైటిస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ప్రపంచ హెపటైటీస్‌ డే ను నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్వర్యంలో ఏటా హెపటైటిస్‌  డే నిర్వహిస్తున్నారు.  సురక్షతం కాని లైంగిక విధానం, రక్త మార్పిడి, వాడిన టూత్‌ బ్రష్‌లు మరొకరు వాడటం ద్వారా హెపటైటిస్‌ వ్యాధి వ్యాపిస్తుంది. సరైన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. టూత్‌ బ్రష్‌లు, షేవింగ్‌రేజర్లు, నేల్‌ కట్టర్లు ఒకరు వాడినవి మరోకరు వాడకుండా ఉండాలి. సెలూన్‌ దుకాణంలో ఖచ్చితంగా కొత్త బ్లేడ్లు మాత్రమే వాడాలి. సురక్షితమైన లైంగిక పద్ధతిని అనుసరించాలి. చెవులు కుట్టించుకోవటం, పచ్చబోట్లు వేయించుకోనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి


అందుబాటులో ఆధునిక వైద్యం: డాక్టర్‌ జంగాల సునీల్‌కుమార్‌, డీఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, ఖమ్మం

హెపటైటిస్‌ వ్యాధికి గతంలో ఇంజెక్షన్‌లు మాత్రమే ఉన్నాయి. కాని ఆధునిక వైద్యవిధానం ద్వారా మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. వైరస్‌ వ్యాప్తి చెందకముందే అవగాహన అవసరం. శరీరంలో హెపటైటిస్‌  వైరస్‌ ఎంత మేరకు ఉంది.. దాని ప్రభావం కాలేయాన్ని ఎంత ఆనారోగ్యానికి గురిచేస్తొందనే వ్యాధి నిర్దారణను బట్టి వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. 


ఆరు వేల మందికి ఉచిత వైద్యం: జంగాల రాజేశ్వర్‌రావు , సేవ్‌ యువర్‌ లివర్‌ ఫౌండేషన్‌

‘సేవ్‌ యువర్‌ లివర్‌ ఫౌండేషన్‌ ’ అధ్వర్యంలో ఇప్పటికే ఆరు వేల  మంది వరకు ఉచితంగా హైపటైటిస్‌ వైద్యసేవలు అందించాం. ఉచితంగా హెపటైటీస్‌ బీ, సీ రక్తపరీక్షలు, బీ వ్యాక్సిన్‌, రూ.5వేలు ఖరీదైన ఫైబ్రోస్కాన్‌ ఉచితంగా ఒక్కొక్కరికి ఇస్తున్నాం. ప్రతీ నెల మొదటి ఆదివారం ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.

Updated Date - 2020-07-28T21:08:01+05:30 IST