‘అధ్యయనం’ ఆరంభం
ABN , First Publish Date - 2020-12-16T04:56:11+05:30 IST
దక్షిణఅయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున సీతారామచంద్రమూర్తి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వగా బుధవారం కూర్మావతారంలో దర్శనమివ్వనున్నారు.

భద్రగిరిలో కన్నులపండువగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
తొలిరోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన రామయ్య.. నేడు కూర్మావతారంలో..
వైదిక సిబ్బందికి దీక్షావస్త్రాలను అందజేసిన ఏఈవో
ముక్కోటికి మంత్రులను ఆహ్వానించిన ఈవో
భద్రాచలం, డిసెంబరు 15: దక్షిణఅయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున సీతారామచంద్రమూర్తి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వగా బుధవారం కూర్మావతారంలో దర్శనమివ్వనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల దర్శనార్థం స్వామి వారిని చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అధ్యయనోత్సవాల నేపఽథ్యంలో బుధవారం నుంచి జనవరి 25 వరకు దేవస్థానంలో స్వామివారికి జరిగే నిత్యకల్యాణాలు నిలిపివేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలోనూ తొలిరోజు రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తొలక్కంతో శ్రీకారం
అధ్యయనోత్సవాల్లో భాగంగా చతుర్వేద, రామాయణ పారాయణం చేసే రుత్వికులకు భద్రాద్రి దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్ దీక్షా వస్ర్తాలను అందజేశారు. తరువాత ప్రత్యేక ఆరాధనలో ముందుగా వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్మ్యం, నాళాయరదివ్య ప్రబంధంలోని అధ్యాయాలను పఠించారు. దీనినే సంప్రదాయ బద్ధంగా తొలక్కం అంటారు. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగిన ఈ కార్యక్రమాలను ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిషోర్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, వైదిక పరిపాలన సిబ్బంది పర్యవేక్షించారు.
మంత్రులకు ‘ముక్కోటి’ ఆహ్వానం
భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఉత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లను మంగళవారం భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ ఆహ్వానించారు. దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, అర్చకులు పొడిచేటి రామభద్రాచార్యులతో కలిసి వెళ్లిన ఆయన మంత్రులను సన్మానించి వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. అలాగే మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కూడా ఆహ్వానించారు.