ఉక్కు ఫ్యాక్టరీ మిథ్యేనా ?

ABN , First Publish Date - 2020-02-12T06:08:15+05:30 IST

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కలగా మారింది. తాజా కేంద్ర బడ్జెట్‌లోనూ దీనిగురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడంతో ఉక్కుఫ్యాక్టరీ కలపై నీలినీడలు

ఉక్కు ఫ్యాక్టరీ మిథ్యేనా ?

కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనే కరువు

కార్యరూపం దాల్చని విభజన చట్టం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శీతకన్ను

 

ఇల్లెందు, ఫిబ్రవరి 11: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కలగా మారింది. తాజా కేంద్ర బడ్జెట్‌లోనూ దీనిగురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడంతో ఉక్కుఫ్యాక్టరీ కలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వంపైనే మోపినప్పటికీ తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలకు, సర్వేలకు నామమాత్రంగా కూడా నిధులు కేటాయించలేదు. వైఎస్‌ కుటుంబీకుల హస్తాల నుంచి అనేక పోరాటాలతో కాపాడుకున్న ఇనుప ఖనిజ సంపదతో స్థానికంగా ఉక్కుఫ్యాక్టరీ నెలకొల్పాలన్న డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక తొలుత ప్రతికూలంగా మారడం మూలంగా వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తరుణంలో బయ్యారంలో రూ.30వేల కోట్ల వ్యయంతో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ‘బయ్యారం ఉక్కు స్థానికుల హక్కు’, ‘బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు’, ‘బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు’ అంటూ అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహించి రక్షణస్టీల్స్‌కు కట్టబెట్టిన ఖనిజ సంపదను స్థానికులు పోరాడి దక్కించుకున్నారు. ఆ తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు, సీఎం కేసీఆర్‌ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు వరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించారు. చంద్రబాబునాయుడు ఏకంగా బయ్యారం గుట్టలపైకి ఎక్కి ఖనిజ సంపదను సైతం పరిశీలించారు. మారిన రాజకీయ, రాష్ట్ర విభజన పరిణామాల అనంతరం కూడా బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం వినిపించింది. ఈ మేరకు ఖనిజ సంపదల నిల్వలు నాణ్యతపై మినరల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సింగరేణి కాలరీస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగాలతో ప్రత్యక్ష అన్వేషణలను సైతం జరిపించింది. అయితే గడిచిన ఆరేళ్లుగా ఉక్కు ఫ్యాక్టరీ అదిగో ఇదిగో అంటూ ఊరించిన కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో నయాపైసా నిధులు కూడా కేటాయించలేదు. 


ఐదు దశాబ్దాల ఆకాంక్ష

బయ్యారం మండలం జిల్లాల పునర్విభజనలో మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్లినా ఇల్లెందు నియోజకవర్గంలోనే అంతర్భాగంగా ఉంది. బయ్యారం మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న డిమాండ్‌ 1969 నుంచి సాగుతోంది. బయ్యారం మండలానికి సమీపంలో ఇల్లెందు సింగరేణి బొగ్గుగనులు, సింగరేణి మండలం మాదారంలో డోలమైట్‌ ఖనిజ నిక్షేపాలు అందుబాటులో ఉండటం, బయ్యారం పెద్దచెరువు సామర్థ్యం పెరగడం, సమీపంలోని గుండ్రాతిమడుగులో రైలు మార్గం అందుబాటులో ఉండటం, దాదాపు 4వేల ఎకరాల అటవీ, ప్రవేట్‌ భూములు అందుబాటులో ఉండటంలాంటి అంశాలు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి సానుకూలంగా ఉన్నాయని భావిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇనుప ఖనిజాన్ని మరింతగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైలు మార్గం సైతం నిర్మిస్తామని కేంద్రానికి ప్రతిపాదించింది.


వివిధ ఏజెన్సీల సర్వేల ద్వారా దేశ వ్యాప్తంగా లభ్యమవుతున్న ఇనుప ఖనిజంలో 12శాతం నిల్వలు బయ్యారం, గూడూరు, భీమదేవరపల్లి మండలాల్లో ఉన్నట్లు వీటి విలువ 700 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. బయ్యారం మండలంలో 2500 హెక్టార్లలో, గూడూరుల మండలంలో 2300 హెక్టార్లలో భీమదేవరపల్లి మండలంలో 342 హెక్టార్లలో ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి, ఇతర అధికారులను స్వయంగా కలిసి బయ్యారం మండలంలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు ప్రారంభించాలని కోరారు. ఒక దశలో సీఎం కేసీఆర్‌ అవసరమైతే సింగరేణి కాలరీస్‌ ఆధ్వర్యంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మింపజేస్తామని ప్రకటించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఉక్కు ప్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి నేటి వరకు ఎలాంటి రూట్‌ మ్యాప్‌ రూపొందించకపోవడం పట్ల ఏజెన్సీ ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-02-12T06:08:15+05:30 IST