అయ్యో పాపం.. ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-12-11T05:19:27+05:30 IST

పెద్దకూతురికి జనవరి 10న పెళ్లి ముహూర్తం.. పెళ్లి పనుల్లో సంబరంగా ఉండాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తమ ఆర్థిక దుస్థితిని ఎవరికీ చెప్పుకోలేక, ఆదుకొనే వారు కానరాక చివరకు తల్లితో పాటు ఇద్దరు కూతుర్లు బంగారం శుభ్రం చేసే ప్రమాదకరమైన రసాయనం(సైనెడ్‌) తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

అయ్యో పాపం.. ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
విగతజీవులుగా పడి ఉన్న తల్తీకూతుళ్లు మృతుల ఫైల్‌ఫోటో

రసాయనం తాగి తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేకపోతున్నామని ఆవేదన 

ఖమ్మం నగరం గాంధీచౌక్‌లో తీవ్ర విషాదం


ఖమ్మంక్రైం, డిసెంబరు 10: పెద్దకూతురికి జనవరి 10న పెళ్లి ముహూర్తం.. పెళ్లి పనుల్లో సంబరంగా ఉండాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తమ ఆర్థిక దుస్థితిని ఎవరికీ చెప్పుకోలేక, ఆదుకొనే వారు కానరాక చివరకు తల్లితో పాటు ఇద్దరు కూతుర్లు బంగారం శుభ్రం చేసే ప్రమాదకరమైన రసాయనం(సైనెడ్‌) తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం నగరం త్రీటౌన్‌ పరిధిలోని గాంధీచౌక్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని గాంధీచౌక్‌లో గోపాలపురం ప్రకాష్‌ కుటుంబం నివాసం ఉంటోంది. 25 సంవత్సరాల క్రితం వీరి కుటుంబం వరంగల్‌ జిల్లా పాపయ్యపేట నుంచి ఖమ్మానికి వలస వచ్చింది. అయితే కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ప్రకాష్‌ భార్య గోవిందమ్మ(48), పెద్దకూతురు రాధిక(32), చిన్నకూతురు రమ్య(28) బుధవారం రాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం(సైనెడ్‌)తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో భర్త ప్రకాష్‌ పని నిమిత్తం మహబూబాబాద్‌ వెళ్లడంతో భార్య, పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్దకూతురు రాధిక డిగ్రీ పూర్తిచేసింది. చిన్నకూతురు పదివరకు చదివింది. వీరిద్దరూ ఇంట్లోనే టైలరింగ్‌ పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ప్రకాష్‌ మహబూబాబాద్‌లోని ఓ జ్యూయలరీ షాపులో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఖమ్మం నుంచి మహబూబాబాద్‌ వెళ్లి పనిచేసి రాత్రికి ఖమ్మం వస్తుంటాడు.


యథావిధిగా బుధవారం కూడా తన విధులకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చే సరికి కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తీయలేదు. దీంతో తన తోడల్లుడు చిట్టోజు చిదంబరాచారికి విషయం చెప్పగా అతడు వచ్చిన తరువాత తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోని వంటగదిలో తన భార్య, ఇద్దరు కుమార్తెలు విగత జీవులుగా పడి ఉండడంతో ప్రకాష్‌ ఒక్కసారిగా నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. ఇంట్లో ఉన్న బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విగత జీవులుగా పడిఉన్న వారిని ప్రకాష్‌ తన తోడల్లుడి సాయంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మృతదేహాలను అన్న ఫౌండేషన్‌వారి సహకారంతో మార్చురీకి తరలించారు. తండ్రా ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఆర్థిక సమస్యలే ఆత్మహత్యలకు కారణం 

తల్లీ కూతుళ్ల ఆత్మహత్యలకు ఆర్థిక సమస్యలే కారణంగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక గత ఎనిమిది నెలలుగా కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో వారు ఉన్నారు. ఈ క్రమంలో పెద్దకూతురు రాధిక వివాహం జనగాంకు చెందిన యువకుడితో నిశ్చయమైంది. వివాహం కూడా కట్నకానుకలు లేకుండానే చేసుకుంటానని వరుడు ముందుకు రావడంతో జనవరి 10 వతేదీని వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం వరంగల్‌లో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. శుక్రవారం అబ్బాయి తరుపువాళ్లు ఖమ్మం రానుండగా వారికి ఏర్పాట్లు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో మనోవేదనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. గోవిందమ్మ పలుమార్లు తన భర్త ప్రకాష్‌తో బిడ్డ పెళ్లి విషయమై చర్చించేది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఇల్లు గడవడమే కష్టంగా మారడం, బిడ్డ పెళ్లి దగ్గరపడుతున్న నేపథ్యంలో వారి బాధను ఎవరికి చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకోవడం పాల్పడడం బంధువులను, స్థానికులను కలిచివేసింది. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. 


ఇలా వదిలి వెళతారనుకోలేదు: తండ్రి ప్రకాష్‌

పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రోజు అన్నం పెట్టే భార్య.. నాతో మాట్లాడి నిద్రపోయే పిల్లలు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. ఎప్పటిలాగానే ఇంటికి వచ్చేసరికి తలుపు తీయకపోవడంతో భయం వేసింది. తన తోడల్లుడు సాయంతో తలుపులు బద్దలు కొట్టాను. అప్పటికే ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదని వైద్యులు తెలిపారు. భార్య, పిల్లల మృతదేహాలు చూడలేకపోయాను. 


Updated Date - 2020-12-11T05:19:27+05:30 IST