చివరి చూపైనా దక్కేలా చూడు భగవంతుడా..!

ABN , First Publish Date - 2020-06-23T10:31:01+05:30 IST

చివరి చూపైనా దక్కేలా చూడు భగవంతుడా..!

చివరి చూపైనా దక్కేలా చూడు భగవంతుడా..!

గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం ఎదురుచూపు

అధికారుల తీరుపై సర్వత్రా ఆక్షేపణలు 


భద్రాచలం, జూన్‌ 22: చివరి చూపైనా దక్కేలా చూడు భగవంతుడా.. అని ఆ నిరుపేద కుటుంబం భగవంతున్ని వేడుకుంటోంది. వారం రోజుల క్రితం భద్రాచలం వద్ద గోదావరి నదిలో గల్లంతైన తులసీరామ్‌(12)కోసం ఎంత వెతికినా ఆ చూకీ దొరకలేదు. తులసీరాం కుటుంబం నిరుపేద కావడంతో ముదిరాజ్‌ కాలనీవాసులే చందాలు వేసుకొని ఇంజన్‌ బోటుకు డీజిల్‌ కొట్టించి గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వంట పని చేసుకొనే జీవించే రామకృష్ణ కుటుంబ సభ్యులకు కనీసం చివరి చూపైనా దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్దకంగా మారింది. మరో వైపు సంబంధిత అధికారులు గోదావరిలో బాలుని గాలింపు విషయంపై దృష్టి కేంద్రీకరించకపోవడంతో కాలనీ వాసుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇదే ఏ ప్రజాప్రతినిధి కుమారుడో, డబ్బున్నో వారి కుటుంబానికి చెందిన బాలుడైతే ఇలానే వ్యవహరించేవారేనా అని స్థానికులు వాపోతున్నారు. సోమవారం వరకు గాలింపు చర్యలు చేపట్టినా తులసీరాం ఆచూకీ లేకపోవడంతో చిట్టచివరగా మంగళవారం మరోసారి గాలింపు చర్యలు చేపట్టేందుకు సన్నద్దమవుతున్నట్లు ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఇకనైనా అధికారులు తులసీరాం ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 

Read more