80శాతం పూర్తి
ABN , First Publish Date - 2020-04-28T10:47:54+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహారభద్రతా కార్డు దారులకు కుటుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల బియ్యంతో

ఉమ్మడి జిల్లాలో 54,264 మందికి అందని నగదు
పోస్టాఫీసుల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు
బ్యాంకు ఖాతాల్లేని తెల్లరేషన్‌కార్డు దారుల జాబితా తపాలా కార్యాలయాలకు..
ఖమ్మం కలెక్టరేట్, ఏప్రిల్ 27 : లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహారభద్రతా కార్డు దారులకు కుటుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల బియ్యంతో పాటు రూ.1500 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే తెల్లకార్డు లబ్ధిదారులకు నగదు జమ 80శాతం పూర్తిచేశారు. మిగిలినవి కూడా ఆయా లబ్ధిదారుల ఖాతాలకే జమవుతోంది. తెల్లకార్డు ఉండి బ్యాంకు ఖాతాల్లేని వారిని కూడా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వారికి కూడా పోస్టాఫీసులద్వారా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాను జిల్లా తపాలా ప్రధాన కార్యాలయాలకు పంపించింది.
దీని ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీకి జిల్లా తపాలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 4,05,169 మంది తెల్లరేషన్‌కార్డు దారులున్నారు. ఇప్పటి వరకు 3,26,285 మందికి రూ.1500 చొప్పున నగదు బదిలీ అయ్యింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,66,176 మంది తెల్లరేషన్‌కార్డు వినియోగదారులుండగా వారిలో మందికి 2,26,023నగదు అందింది. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాల వివరాలు సరిగ్గా లేక పోవడం, కొద్దినెలలుగా రేషన్ నిర్వహణ లేకపోవడం, ఇంకొంత మందికి అసలు ఖాతాలే లేకపోవడం లాంటి అంశాలు గుర్తించారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో 12,111 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40,153 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి.. ఆ జాబితాను మండలాల వారీగా ప్రధాన తపాలా కార్యాలయానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పంపించింది.
పీవోటీడీ మిషన్ల ద్వారా పంపిణీ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బ్యాంకు ఖాతాలులేని తెల్లరేషన్‌కార్డు దారులకు నగదు పంపిణీకి పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పౌర సరసరఫరాల శాఖ వీరిని గుర్తించి పోస్టాఫీసుల్లో అమలు చేస్తున్న ఎన్నార్‌ఈజీఎస్ విధానానికి అనుసంధానం చేసింది. దాని ఆధారంగా లబ్ధిదారులకు నగదును పీవోటీడీ మిషన్ల ద్వారా పంపిణీ చేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మండలాల వారీగా అందిన జాబితా ప్రకారం తపాలా కార్యాలయంలో మ్యాపింగ్ చేస్తున్నారు. ఆయా లబ్ధిదారులు ఏఏ ఉపతపాలా కార్యాలయం పరిధిలోకి వస్తారో అనే విషయాన్ని తపాలా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.
పీవోటీడీ మిషన్లు రావాల్సి ఉంది..ఎలమందయ్య, జిల్లా తపాలాశాఖ సూపరింటెండెంట్
ఉమ్మడి జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని వారి జాబితా అందింది. ఖమ్మంలో 12,111, భద్రాద్రి కొత్తగూడెంలో 40,153 మంది ఉన్నారు. మండలాల వారీగా అందిన జాబితాను మ్యాపింగ్ ద్వారా వారు ఏ పోస్టాఫీస్ పరిధిలోకి వస్తారనేది గుర్తిస్తున్నాం. వీరికి ప్రత్యేక పీఓటీడీ మిషన్లు అవసరం ఉంది. హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట ప్రాంతాల నుంచి పీవోటీడీ మిషన్లు తెప్పిస్తున్నాం. అయితే ప్రస్తుతానికి అవి కొరతగా ఉన్నట్లుంది. నల్గొండ 60, వరంగల్20,హన్మకొండ నుంచి 20 మిషన్లు రేపటి వరకు జిల్లాకు రానున్నాయి. వీటి కాన్ఫిగరేషన్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఖచ్చితమైన తేదీని నిర్ణయించి నగదును అందిస్తాం.
80 శాతం నగదు పంపిణీ రాజేంద్రప్రసాద్, ఖమ్మం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ఖమ్మం జిల్లాలో 4,05,169మంది తెల్లకార్డు లబ్ధిదారులకుగాను ఇప్పటివరకు 3,26,285మందికి నగదు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ య్యింది. దాదాపు 80శాతం పూర్తయ్యింది. బియ్యం పంపిణీ కూడా 95శాతం పూర్తిచేశాం. అయితే బ్యాంకు ఖాతాలు లేని వారికి కూడా నగదు పంపిణీ కోసం పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా జాబితాను తపాలా కార్యాలయాలకు ఇప్పటికే పంపినట్టు సమాచారం.