కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వేలైన్‌కు మరో రూ.200కోట్లు

ABN , First Publish Date - 2020-03-12T06:39:54+05:30 IST

భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌) నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌

కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వేలైన్‌కు మరో రూ.200కోట్లు

నిర్మాణానికి తన వంతుగా చెల్లించిన సింగరేణి 

రైల్వే జీఎంకు చెక్కును అందజేసిన సీఎండీ 


కొత్తగూడెం, మార్చి 11 : భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌) నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌ పనులకు సింగరేణి సంస్థ తనవంతుగా మరో రూ.200కోట్లను రైల్వేశాఖకు చెల్లించింది. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో బుధవారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం గజానన్‌ మాల్యాకు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఈ చెక్కును అందజేశారు. దీంతో సింగరేణి సంస్థ మొదటి సారి చెల్లించిన రూ.156.38కోట్లతో కలిపి.. ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌ కోసం రూ.356.38 కోట్లను చెల్లించినట్లయింది. సత్తుపల్లిలో కొత్త ఓసీ గనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ రైల్వే జీఎం గజానన్‌ మాల్యాను కోరారు. అయితే పనులు వేగంగా సాగుతున్నాయని వచ్చే డిసెంబరు నాటికీ పూర్తి చేయగలమని రైల్వే అధికారులు ఈ సందర్భంగా వివరించారు.


కొత్తగూడెం - సత్తుపల్లి వరకూ నిర్మించే ఈ 53 కిలో మీటర్ల రైల్వేలైన్‌ వల్ల సింగరేణి సంస్థ సత్తుపల్లిలో నిర్వహిస్తున్న ఓసీ గనుల బొగ్గును పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో రైలు మార్గం ద్వారా కొత్తగూడెం (సీహెచ్‌పీ)కి ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వీలు కలగనుంది. ప్రస్తుతం సత్తుపల్లి ఓసీ గనుల నుంచి ఉత్పత్తయ్యే బొగ్గును 70కిలో మీటర్ల దూరంలోగల రుద్రంపూర్‌ (కొత్తగూడెం) సీహెచ్‌పీకి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు.  అయితే మూడేళ్ల క్రితం సింగరేణి, రైల్వే ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ రైల్వే లైన్‌ నిర్మాణానికి ఒప్పందం కుదిరగా.. మారిన అంచనా వ్యయం ప్రకారం మొత్తం రూ.927కోట్లు అవుతోంది. దీనిలో సింగరేణి రూ.618.55కోట్లు, రైల్వే రూ.309.30కోట్లను భరించాలని అంగీకారానికి వచ్చారు. 

Updated Date - 2020-03-12T06:39:54+05:30 IST