అద్దెభవనాల్లో అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2020-03-16T12:43:17+05:30 IST

మూడునుంచి ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు ఆటపాటలతో విద్యాబుద్దులు నేర్పి ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయించేందుకు సంసిద్ధం

అద్దెభవనాల్లో అంగన్‌వాడీలు

ఆట పాటలకు స్థలం లేక చిన్నారుల అవస్థలు 

మౌలిక వసతులకు నోచుకోని కేంద్రాలు 

తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న టీచర్లు  


మార్చి 15: మూడునుంచి ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు ఆటపాటలతో విద్యాబుద్దులు నేర్పి ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయించేందుకు సంసిద్ధం చేయడానికి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలను గ్రామాలలో ఏర్పాటు చేశారు. చిన్నారులకు బోధనతో పాటు, పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం ఈ కేంద్రాల ఉద్దేశ్యం. అంత ప్రాధాన్యమున్న ఈ కేంద్రాలు జిల్లాలో మౌలిక వసతులు లేక నిరుపయోగమవుతున్నాయి. సొంత భవనాలు లేక ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీస్తున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. చంద్రుగొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాలలో 160 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో 94 మెయిన్‌ కేంద్రాలు కాగా 66 మినీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  


అద్దె భవనాలే అధికం 

జూలూరుపాడు మండలంలో 67 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 18 కేంద్రాలకే సొంత భవనాలు ఉన్నాయి. 20 కేంద్రాలను అద్దె భవనాలలో నిర్వహిస్తుండగా, మరో 23 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోని గదులు, వరండాలలో నిర్వహిస్తున్నారు చంద్రుగొండ మండలంలో 51 కేంద్రాలు ఉండగా వాటిలో ఎనిమిది కేంద్రాలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 43 కేంద్రాలలో 20 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా మరో 23 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోని ఆవరణలో నడుపుతున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 42 కేంద్రాలు ఉండగా 16 కేంద్రాలకే సొంత భవనాలు ఉన్నాయి. 14 కేంద్రాలను అద్దె చెల్లిస్తూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భవనాలలో మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  


అద్దె చెల్లింపుల్లోను జాప్యమే..  

అంగన్‌వాడీ కేంద్రాల అద్దె చెల్లింపులు ప్రహసనంగా మారింది. ప్రభుత్వం ప్రతినెలా అద్దె చెల్లింపు తాలుకు సొమ్మును టీచర్లకు చెల్లించడం లేదు. దీంతో టీచర్లు అద్దె చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దెకు తీసుకున్న భవనాలలో గదుల సంఖ్యను బట్టి ప్రభుత్వం అద్దెను చెల్లిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే అరకొర అద్దెకు గ్రామాలలో ఎక్కడా భవనాలు దొరికే పరిస్థితి లేదు. దీంతో అంగన్‌వాడీ టీచర్లు సొంతంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు గదులకు రూ.750లు అద్దెగా చెల్లిస్తోంది. రెండు గదులకు రూ.500లు, ఒక్క గదికి రూ.250ల చొప్పున చెల్లిస్తోంది. ఈ చెల్లింపులు గిట్టుబాటు కాక గృహ యజమానులు అద్దెకు భవనాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.


దీంతో కేంద్రాలను నిర్వహించాల్సిన బాధ్యత టీచర్లపై ఉండడంతో తమ సొంత సొమ్మును కొంత కలిపి యజమానులకు అద్దె రూపంలో చెల్లిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌ నుంచి ప్రభుత్వం అద్దె బిల్లులను చెల్లించడం లేదు. దీంతో యజమానులు భవనాలను ఖాళీ చేయాలని టీచర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనిని తట్టుకోలేక కొంతమంది అంగన్‌వాడీ టీచర్లు అప్పు చేసి మరీ అద్దె చెల్లిస్తున్నారు. పెండింగ్‌ అద్దె బిల్లులను వెంటనే మంజూరు చేసి తమ ఇబ్బందులను తొలిగించాలని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణకు శాశ్వత భవనాలను నిర్మించాలని అంగన్‌వాడీ టీచర్లు కోరుతున్నారు. 


మౌలిక వసతులు కరువు 

సొంత భవనాలు గల అంగన్‌వాడీ కేంద్రాలు సైతం మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. నిరుపయోగంగా పడి ఉన్న మరుగుదొడ్లు ఈ కేంద్రాలలో దర్శనమిస్తున్నాయి. సరైన ఆట స్థలాలు లేక చిన్నారులు ఆట, పాటలకు దూరమవుతున్నారు. ఇరుకు గదుల్లో కేంద్రాలను నిర్వహిస్తుండడం అసౌకర్యంగా మారింది. సొంత భవనాల పరిస్థితే ఇంద దయనీయంగా ఉంటే ఇక అద్దె భవనాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.


అద్దె భవనంలో నిర్వాహణ ఇబ్బందిగా మారింది: స్రవంతి, టీచర్‌ మాచినేనిపేటతండా 

సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహించడం ఇబ్బందిగా మారింది. సరైన వసతులు లేకపోవడంతో చిన్నారులకు అసౌకర్యంగా ఉంది. సొంత భవనం లేక ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించి కేంద్రం నిర్వాహణకు సొంత భవనాన్ని నిర్మించాలి.


ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాం

- నిర్మలజ్యోతి, ప్రాజెక్ట్‌ సీడీపీవో చంద్రుగొండ 

అద్దె భవనాలలో నడుస్తున్న కేంద్రాలను గుర్తించి వాటికి శాశ్వత భవనాలను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే ఆయా గ్రామాలలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను చేపడతాం.


Updated Date - 2020-03-16T12:43:17+05:30 IST