అనంతారం అడవిలో పులి సంచారం?

ABN , First Publish Date - 2020-11-21T06:18:05+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారందామరతోగు అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంత వాసులు ఆందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం...

అనంతారం అడవిలో పులి సంచారం?

బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ ప్రజలు

ఆనవాళ్ల కోసం అటవీ శాఖ అధికారుల గాలింపు


కరకగూడెం, నవంబరు 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారందామరతోగు అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంత వాసులు ఆందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. మణుగూరు, ఇల్లెందు, ములుగు జిల్లా తాడ్వాయి డివిజన్ల అటవీ శాఖాధికారులు శుక్రవారం పులి ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అనంతారందామరతోగు అటవీ ప్రాంతం పరిధిలో తుమ్మలగూడెం, చొప్పాల, మొగలితోగు, గొడుగుబండ, రేగుళ్ల, విప్పలగుంపు, రంగాపురం, గుండాల మండలం దామరతోగు గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఓ పులి సంచరిస్తూ కన్పించిందని, పగలు, రాత్రి సమయాల్లో పులి గాండ్రిపులు విన్పిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. కొందరు స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా శుక్రవారం వట్టివాగు, పులుసుబొంత పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు పులి ఆనవాళ్ల కోసం ముమ్మరంగా గాలించారు. కానీ వారు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. 


గాలిస్తున్నాం.. ఆధారాలు లభించలేదు.. 

అనంతారం, దామరతోగు అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం గాలింపు చర్యలు చేపట్టాం. ఇందుకు గుండాల, ఇల్లెందు, తాడ్వాయి అధికారుల సహకారం కూడా తీసుకున్నాం. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు.

గోవింద్‌, అనంతారం సెక్షన్‌ అధికారి


Updated Date - 2020-11-21T06:18:05+05:30 IST