‘దీపావళి’ దుకాణాలపై సందిగ్ధం

ABN , First Publish Date - 2020-11-06T10:19:38+05:30 IST

మూడు రోజుల సందడి.. కోట్ల రూపాయల వ్యాపారం. దుకాణాల చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం.. ప్రతీ సంవత్సరం దీపావళినాటికి రెండురోజుల ముందునుంచి మైదానాల్లో జరిగే దృశ్యం. ఈ వెలుగుల పండుగ

‘దీపావళి’ దుకాణాలపై సందిగ్ధం

టపాసుల విక్రయాలపై ఖమ్మం జిల్లాలో కనిపించని స్పష్టత

కొత్తగూడెంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన అధికారులు

చలానాలు తీసిపెట్టుకున్న వ్యాపారులు

అడ్వాన్సుల చెల్లింపులపై ఆందోళన


ఖమ్మం, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల సందడి.. కోట్ల రూపాయల వ్యాపారం. దుకాణాల చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం.. ప్రతీ సంవత్సరం దీపావళినాటికి రెండురోజుల ముందునుంచి మైదానాల్లో జరిగే దృశ్యం. ఈ వెలుగుల పండుగ జిగేల్‌మనాలంటే నెల ముందునుంచే వ్యాపారులు పనులు ప్రారంభించాలి. మరో పది రోజుల్లో దీపావళి ఉండగా ఖమ్మం జిల్లాలో టపాసుల దుకాణాల ఏర్పాటుపై అధికారుల నుంచి ఎలాంటి క్లియరెన్స్‌ లేకపోవడంతో వ్యాపారుల్లో సందిగ్ధత నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.  

 

అడ్వాన్సుల చెల్లింపులపై ఆందోళన

 నెల రోజుల ముందుగానే వ్యాపారులు తాము సరుకు కొనుగోలు చేసేందుకు అడ్వాన్సులు చెల్లించి ఆర్డరు పెట్టుకుంటారు. ఇంకా క్లియరెన్స్‌ లేకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. అడ్వాన్సులు చెల్లించాక అధికారులు అనుమతులు ఇవ్వకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆలస్యంగా అనుమతులు ఇవ్వడం వలన  హడావిడి కొనుగోళ్లకు పెట్టుబడి అధికం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు అనుమతి ఇచ్చినా షెడ్ల నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. సమయం తక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులు ముందుగానే చలాన్లు తీసుకుని అధికారుల నుంచి క్లియరెన్స్‌ కోసం వేచిచూస్తున్నారు. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా..

దీపావళి దుకాణాల ఏర్పాటుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు రోజుల క్రితమే సమావేశం నిర్వహించారు. ఆ జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి బాణసంచా విక్రయాలపై రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌, అగ్నిమాపకశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. బాణసంచా విక్రయాల కోసం వ్యాపారులు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విధి విధానాలను నిర్ధేశించారు.

 

కరోనా వేళ వ్యాపారం సాగేనా?

అందరి ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన కరోనా సమయంలో వెలుగుల వ్యాపారం ఎలా  ఉండబోతుందోనని ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన ప్రజలు టపాసులపై అధికంగా ఖర్చు చేసే అవకాశాలున్నాయా? లేదా అన్న విషయాలపై అంచనాలు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే స్టాకు తెచ్చి పెట్టుకోవాలని యోచిస్తున్నారు. కరోనా వేళ ఇతర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇళ్లవద్దే ఉంటున్నారు కాబట్టి వ్యాపారం జోరుగా సాగుతోందని కొందరు.. కరోనాకు బయపడి బయటకు రారు కాబట్టి దివాళా తీసే అవకాశాలున్నాయని మరొకొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  


గతంలో అధికారుల పేరిట అక్రమ వసూళ్లు

టపాసుల వ్యాపారుల నుంచి గతంలో కొందరు వ్యక్తులు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పాలని భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏటా ఇదే తంతుగా సాగిస్తోన్న సదరు వ్యక్తులు గతేడాది కూడా అదే పనిగా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. ఒక్కో షాపు యజమాని నుంచి ఫీజులు, దుకాణాల ఏర్పాటుకు కావాల్సిన నగదు రూ.15,500 వసూలు చేస్తుండగా అదనంగా రూ.18 వేల వసూలు చేశారన్న ఆరోపణలు వినిపించాయి. 


జిల్లా వ్యాప్తంగా 180 వరకు దుకాణాలు ఏర్పాటు కానుండగా... ఒక్క ఖమ్మం నగరంలో దాదాపు వందకు పైగా ఏర్పాటు చేసేవారు. ఆయా షాపుల యజమానుల నుంచి గతేడాది సుమారు రూ.  రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్టు వినికిడి. ఉన్నతస్థాయి అధికారుల నుంచి శాఖల వారీగా పోలీస్‌, ఫైర్‌, మున్సిపాలిటీ, ఆర్డీవో కార్యాలయంతోపాటుగా మీడియా పేర్లు చెప్పి వసూలు చేసినట్టు సమాచారం. కాగా ఈ యేడాది అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-06T10:19:38+05:30 IST