వ్యవసాయరంగానికి నూతన శకం:పువ్వాడ అజయ్

ABN , First Publish Date - 2020-12-12T05:01:30+05:30 IST

వ్యవసాయరంగానికి నూతన శకం:పువ్వాడ అజయ్

వ్యవసాయరంగానికి నూతన శకం:పువ్వాడ అజయ్
మాట్లాడుతున్న రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

కేంద్రం కుట్రలు చేసినా రైతుకు అన్యాయం జరగనివ్వం

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రైతువేదికల ప్రారంభోత్సవం

రఘునాథపాలెం, డిసెంబరు 11 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో వ్యవసాయరంగానికి నూతన శకం ఆరంభమైందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం తమదేనని రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రుఘునాథపాలెం మండలంలోని చిమ్మపుడి, పాపటపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతువేదికలను, పల్లెప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. చిమ్మపుడి గ్రామంలో వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర రైతులను ఆదుకుంటామని, రైతులు రైతువేదికలతో తమ సమస్యలను, గిట్టుబాటు ధరను, భూసార పరిక్షలు నిర్విహించుకునే విధంగా ప్రత్యేక డిజైన్లతో రైతువేదికలు నిర్మించామన్నారు. పొరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో రైతును రాజును చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ఇస్తూ రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. నాడు కరెంటు ఉచితం అన్నమాటే గాని సక్రమంగా కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్‌ ఇవ్వటం ద్వారా విద్యుత్‌షాక్‌లతో, పాముకాటుతో ఎన్నో రైతు కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. నేడు ఆపరిస్థితిలేదని తెలిపారు.సీతారామ ప్రాజెక్టుతో రఘునాథపాలెం మండలంలో గోదావరి జలాలు ప్రవహించి 7.50లక్షల ఎకరాలకు నీరు అందించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, అదనపు కలెక్టర్‌ స్నేహలతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:01:30+05:30 IST