ఏసీ మిరపకు ధరాఘాతం

ABN , First Publish Date - 2020-12-29T05:10:27+05:30 IST

ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం ఏసీ మిరపకాయల ధర రోజు రోజుకూ పడిపోతోంది.

ఏసీ మిరపకు ధరాఘాతం
మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన ఏసీ మిరప

తగ్గుతున్న తేజ రకం ధర

ఈనెలలో రూ.1500 వరకు డౌన్‌

ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడమే కారణం

ఖమ్మం మార్కెట్‌ , డిసెంబరు 28: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం ఏసీ మిరపకాయల ధర రోజు రోజుకూ పడిపోతోంది. సోమవారం క్వింటాలు రూ. 14,500 జెండా పాటగా నిర్ణయించగా కనిష్ఠంగా క్వింటాలు రూ. 9,200కు, నమూనా రకాన్ని రూ. 11,000 నుంచి రూ 12,500 వరకు కొనుగోలు చేశారు. గత సెప్టెంబర్‌ నెలలో మార్కెట్‌లో క్వింటా ధర రూ. 20,500 పలికిన ఎండు మిరప, ఆ తరువాత ధర కొన్ని రోజులు తగ్గుతూ మరి కొన్ని రోజులు పెరుగుతూ వచ్చింది. సీజన్‌ ప్రారంభంలో మార్కెట్‌లో ఏసీ మిరప ధర క్వింటా రూ.19,000 నుంచి ప్రారం భమైంది. చైనా, సింగపూర్‌, మలేషియా, ఽథాయిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు ఎగుమతులు ఉండటంతో ధర కొంత ఆశాజనకంగా కన్పించింది. ప్రస్తుతానికి విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం, వానాకాలం పంట ఖమ్మంతో పాటు గుంటూరు, వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లకు వస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నెలలోనే ఏసీ మిరపకు క్వింటాకు రూ. 1,000 ల నుంచి రూ. 1,500 ల వరకు ధర తగ్గడంతో మిర్చీ రైతులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతుబంధు పథకం కింద గతంలో వడ్డీ లేని రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ లేని ఆరు నెలల కాలపరిమితి ముగిసింది. తిరిగి రైతుబంధు అప్పు చెల్లించాలని మార్కెట్‌ అధికారులు నోటీసులు పంపుతున్నారు. ఏసీ మిరప ధర తగ్గడంతో పంటను అమ్మక పోవడంతో అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేమని పలువురు రైతులు అధికారులను కలిసేందుకు మార్కెట్‌ కార్యాలయానికి వస్తున్నారు. మార్కెట్‌ కు వస్తున్న కొత్త మిరిప క్వింటాకు  రూ. 14,301 లు జెండాపాట ధరగా నిర్ణయించగా నమూనా రకాలను రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు కొనుగోలు చేస్తుండగా కనిష్ఠంగా క్వింటాలు రూ. 8,000కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-29T05:10:27+05:30 IST