నిద్ర రావట్లేదు !

ABN , First Publish Date - 2020-09-06T10:17:09+05:30 IST

రోనా.. రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మొదట్లో జ్వరం, జలుబు, విపరీతమైన దగ్గు వంటి ..

నిద్ర రావట్లేదు !
కోవిడ్‌ రోగులకు కొత్త సమస్య 

ఒంటరితనం, మానసిక కుంగుబాటే కారణమా ?

ఎలకా్ట్రనిక్‌ పరికరాలు ఎక్కువగా వాడటం కూడా..

వైద్యుల వద్దకు బారులుతీరుతున్న బాధితులు


ఖమ్మం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కరోనా.. రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మొదట్లో జ్వరం, జలుబు, విపరీతమైన దగ్గు వంటి లక్షణాలు కనిపించగా.. రానురాను ఆయా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వచ్చాయి. అయితే పాజిటివ్‌ వచ్చిన పేషంట్లలో ప్రస్తుతం కొత్త సమస్య కనిపిస్తోంది. ఇన్నాళ్లు రోగానికి సంబంధించిన లక్షణాలతోనే ఇబ్బందులు పడిన బాధితులు ప్రస్తుతం రాత్రి వేళల్లోనూ నిద్రపట్టక సతమతమవుతున్నారు.


పాజిటివ్‌ వచ్చిన కొద్దిరోజులు దానికి సంబంధించిన మందులు వాడిన తర్వాత వారికి నిద్రపట్టడం లేదంటూ డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అలా ప్రతిరోజు పదుల సంఖ్యలో బాధితులు తమను సంప్రదిస్తున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. కాగా నిద్రపట్టకపోవడం  తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దవయస్సువారితోపాటుగా యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారనీ, నిద్రపట్టకపోవడాన్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. 


ఒంటరితనం, మానసిక కుంగుబాటే కారణమా ?

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని దూరంగా ఉంచే క్రమంలో వారికి ఒక ప్రత్యేక ప్రదేశాన్ని, ఇంట్లో ఇబ్బందిలేకుండా ఉండేవిధంగా ఒక గదిని కేటాయిస్తున్నారు. ఎప్పుడూ ఒకే గదిలో ఉండాల్సి రావడం.. బయటి ప్రపంచానికి దూరంగా ఉండటం వంటి అంశాలు నిద్రపోయే సమయంలో ఒంటరితనం వెంటాడటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కరోనా వచ్చిందని చుట్టుపక్కల వారు ఏమైనా అనుకుంటారేమోనన్న భావన మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నట్టు తెలుస్తోంది.


ఫలితంగా ఆయా కరోనా రోగులకు నిద్రపట్టకుండా కాలం గడుపుతున్నారనీ కొందరు డాక్టర్లు చెబుతున్నారు. కొందరైతే పగటివేళల్లో నిద్ర పోతున్న కారణంగా రాత్రి వేళల్లో నిద్ర రావట్లేదని భావించి పగలు నిద్రించకుండా ఉన్నప్పటికీ రాత్రివేళల్లో నిద్ర రావట్లేదని సమస్యలు వివరిస్తున్నట్టుగా చెబుతున్నారు. మరికొందరికి హాఠాత్తుగా మేలుకువ వచ్చేస్తోందని, ప్రశాంతంగా నిద్ర కరువవుతోందంటూ డాక్టర్లను సంప్రదిస్తున్నట్టు సమాచారం.


ఎలకా్ట్రనిక్‌ పరికరాలు ఎక్కువగా వాడటం కూడా..

ప్రస్తుతం ఖాళీగా ఐసోలేషన్‌లో ఉంటున్న వారు కాలక్షేపం కోసం ఎలక్ర్టానిక్‌ పరికరాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నిత్యం మోబైల్‌లోనూ, టీవీల్లోనూ తమకు నచ్చిన ప్రోగ్రామ్స్‌, వీడియోలు చూస్తూ, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కాలం గడపడం వల్ల కూడా నిద్రపట్టకుండా ఉండాటానికి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. నిత్యం మొబైల్‌, ఫోన్‌ స్ర్కీన్‌ని చూడటం వల్ల కాంతి కిరణాలు కంటిపై పడి కంటిచూపుపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.


దానితోపాటుగా నిద్రకు భంగం వాటిల్లుతోందని, అలా చేయడం వల్ల సాధారణ సమయాల్లోనూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తుందనీ, కరోనా రోగులకు అలాంటి పరిస్థితులు వస్తే మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటున్నారు. వీలైనంత వరకు ఐసోలేషన్‌లో, క్వారైంటైన్‌లో ఉన్నవారు పుస్తకాలు చదవడం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇబ్బందిలేకుండా ఉంటుందంటున్నారు. 


వీలైనంత వరకు నిద్రపోవాలి..డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు

కొవిడ్‌ పేషంట్లకు నిద్రపట్టకపోవడాన్ని కరోనా ఇన్సోమియా అంటారు. అది ఒత్తిడి, భయం వంటి వాటివల్ల వస్తుంది. కరోనా రోగులకు గతంకంటే భిన్నమైన వాతావరణంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వారికి ఆ పరిస్థితి వస్తుంది. దాని నుంచి బయటకు రావాలంటే ప్రస్తుతం వారు చేసే పనులను రొటీన్‌గా మార్చుకోవాలి. ఉదయాన్నే లేచిన దగ్గరనుంచి యోగా, ఎక్సర్‌సైజ్‌, బ్రేక్‌ఫాస్ట్‌, పేపర్‌ చదవడం వంటి అలవాట్లను రోటీన్‌గా మార్చుకోవాలి. వీలైనంతరకు కాఫీ, టీ తగ్గించుకోవాలి. ఆల్కహాల్‌, స్మోక్‌ను పూర్తిగా వదిలేయాలి. అవసరముంటే తప్ప ఫోన్‌ వాడకూడదు. ఒకవేళ వాడినా పడుకోవడానికి ఒక గంట ముందునుంచే దూరం పెట్టాలి. 

Updated Date - 2020-09-06T10:17:09+05:30 IST