ఇలా చెత్తవేస్తే రోగాలు రావా..!

ABN , First Publish Date - 2020-03-02T12:21:59+05:30 IST

‘ఇలా చెత్త వేస్తే దోమలు పెరగవా..? రోగాలు రావా..? మీరే చెత్త వేస్తూ మీ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇలా చెత్తవేస్తే రోగాలు రావా..!

ఖమ్మం పట్టణప్రగతి కార్యక్రమంలో ఆకస్మిక తనిఖీ

చిరువ్యాపారులతో మాట్లాడిన కేటీఆర్‌

అపరిశుభ్ర పరిసరాలపై అసంతృప్తి

అధికారుల తీరుపై అసహనం


ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 1:  ‘ఇలా చెత్త వేస్తే దోమలు పెరగవా..? రోగాలు రావా..? మీరే చెత్త వేస్తూ మీ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి మారాలి. లేదంటే మీకు జరిమానాలే..! వేస్తాం’ అంటూ రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చిరువ్యాపారులను హెచ్చరించారు. పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఆదివారం ఖమ్మం నగరానికి వచ్చిన కేటీఆర్‌ త్రీటౌన్‌ ప్రాంతంలోని ట్రంక్‌రోడ్డు మీదుగా వెళ్తూ కాల్వఒడ్డు సమీపంలో గోళ్లపాడు చానల్‌ వద్ద ఆగారు. బస్సులో నుంచి పరిసరాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ‘ఇదేందీ అన్నా... ఏంటిలా ఉంది.. ఆపండి ఆపండి బస్సు ఆపండి’ అంటూ తాను ప్రయాణించే బస్సును ఆపారు. ఆతర్వాత గోళ్లపాడు చానల్‌ను సందర్శించారు. కాలువలో ఉన్న చెత్తాచెదారాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పక్కనే ఉన్న చిరువ్యాపారుల వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..


పూలవ్యాపారి గోరింట్ల వరలక్ష్మితో.. 

మంత్రి : ఏమ్మా ఈ చెత్తాచెదారం మెత్తం మీరే వేస్తున్నారా..? 

వరలక్ష్మి : మేం వేయడంలేదు సార్‌. పైనుంచే వస్తోంది. 

మంత్రి : చెత్తను డబ్బాల్లో వేసుకొండి... మునిసిపాలిటీ వాళ్లు వచ్చి తీసుకెళ్తారు.

పక్కనే అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేసుకునే ఓ 60 ఏళ్ల వృద్ధుడితో.. 

మంత్రి : నీపేరేంటీ.. నీకు పింఛన్‌ వస్తుందా..?

వృద్ధుడు : తుమ్మా వెంకటేశ్వర్లు సార్‌ .. పింఛన్‌ వస్తుంది సార్‌

మంత్రి :మీరు మీ చెత్తా చెదారాన్ని ఎక్కడ పోస్తున్నారు

వృద్ధుడు : ఇదుగో ఈ డబ్బాలో వేస్తున్నాం సార్‌ (డబ్బాను చూపించారు). 

మంత్రి :ఇలా డబ్బాలోనే వేసుకోవాలి. (అంటూ ముందుకు సాగారు)

 కూరగాయలు విక్రయించే మహిళతో.. 

మంత్రి : ఏమ్మా నీపేరేంటి

మహిళ : ఖాజాబీ సార్‌

మంత్రి : ఈ చెత్త మీరే వేస్తున్నారా..? ఈ కాలువలో చెత్తా చెదారం ఏంటీ ఇలా వేస్తున్నారు..?

మహిళ : లేదు సార్‌ మేం వేయడంలేదు.. అంతా పైనుంచే వస్తుంది సార్‌ 

మంత్రి : బలే ఉన్నారమ్మా మీరు.. మీరు అలాగే అంటున్నారు. మీ మంత్రి పువ్వాడ అదే అంటున్నారు. పైనుంచి ఎలా వస్తుందీ చెత్తా చెప్పమ్మా. 

మహిళ : లేదు సార్‌ మేం వేయడం లేదు 

మంత్రి : ఇలా చెత్త వేస్తే మీకే ఇబ్బంది మురుగు ముందుకు పోదు కదా.. ఇక్కడే మురిగి పోతుంది కదా.. దీని మూలంగా దోమలు పెరుగుతాయి కదా... రోగాలు వస్తాయి కదా.. ఆతర్వాత నష్టపోయేది ఎవరు చెప్పండి.. అందుకే చెత్త చెదారాన్ని వేయొద్దు ఇలా. 

మహిళ : అయ్యా... మాకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రాలేదు. సార్‌ ఇప్పించండయ్యా.

మంత్రి :దీనికి మీ మంత్రి పువ్వాడను కలవండి ఆయనే చూసుకుంటారు. 


జరిమానాలు విధిస్తామని హెచ్చరిక...

ఇలా పరిసరాల్లో చెత్తా చెదారాన్ని వేస్తే ఇక నుంచి జరిమానాలు విధిస్తామంటూ మంత్రి కేటీఆర్‌ వారిని హెచ్చరించారు.  ఆ తర్వాత ట్రాక్టర్‌ డ్రైవర్‌తోనూ మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మునిసిపల్‌ అధికారుల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బస్సెక్కిన తర్వాత కూడా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ‘ఏంటన్నా.. ఏంటీ ఈపరిస్థితి’ అని అడిగారు... దీనికి మంత్రి పువ్వాడ అజయ్‌ ‘అన్నా.. గోళ్లపాడు చానల్‌ అన్నా ఇది.. దీన్ని ఆధునికీకరిస్తున్నాం. పనులు జరుగుతున్నాయన్నా’ అంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ వెంట మంత్రులు పువ్వాడఅజయ్‌కుమార్‌, రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, బత్తుల మురళీప్రసాద్‌, తదితరులున్నారు. 

Updated Date - 2020-03-02T12:21:59+05:30 IST