ఖమ్మం ఆస్పత్రికి 68మంది తరలింపు

ABN , First Publish Date - 2020-03-25T11:30:54+05:30 IST

ఖమ్మం జిల్లాలో కోవిడ్‌-19 వైరస్‌ లక్షణాలున్నాయని అనుమానిస్తున్న 68మందిని అధికారులు వైద్యపరీక్షల నిమిత్తం ఖమ్మంలోని ఆస్పత్రులకు మంగళవారం తరలించారు.

ఖమ్మం ఆస్పత్రికి 68మంది తరలింపు

మధిర నుంచి ఒకరు, 

వైరాలో13, తల్లాడలో 54 అనుమానితులు


వైరా/తల్లాడ/మధిరటౌన్‌, మార్చి 24: ఖమ్మం జిల్లాలో కోవిడ్‌-19 వైరస్‌ లక్షణాలున్నాయని అనుమానిస్తున్న 68మందిని అధికారులు వైద్యపరీక్షల నిమిత్తం ఖమ్మంలోని ఆస్పత్రులకు మంగళవారం తరలించారు. తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో 20మందిని సోమవారం, మంగళవారం అదే గ్రామానికి చెందిన మరో 15మందిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. భద్రాద్రి జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడికి కోవిడ్‌-19వైరస్‌ లక్షణాలు ఉండటం, సదరు యువకుడిని వీరందరు కలిసిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరందరిని 108లో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


అయితే ఈ 15మంది పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో ఓ వేడుకకు హాజరై యువకుడితో కలిశారనే అనుమానం ఉంది. అదే విధంగా కరోనా ప్రభావిత యువకుడికి మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఉద్యోగితోపాటు అతనితో సన్నిహితంగా మెలిగిన మరో 18మంది అనుమానితులను 108వాహనాల్లో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు తల్లాడ మండలం నుంచి 54మంది అనుమానితులను వైద్యపరీక్షలు, చికిత్సల నిమిత్తం తరలించారు. అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను తల్లాడ మండల అధికారులు ముమ్మరం చేశారు. వైరా మండలంలోని గొల్లెనపాడు గ్రామానికి చెందిన 13మందిని వైద్యపరీక్షల కోసం మంగళవారం ఖమ్మం తరలించారు. కొత్తగూడెంలో కోవిడ్‌-19వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో వైరా మండల అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.


అదేవిధంగా కరోనా పరీక్షల నిమిత్తం మధిర పట్టణానికి చెందిన ఓ యువకుడిని మధిర సివిల్‌ ఆస్పత్రి వైద్యులు మంగళవారం ఖమ్మంకు తరలించారు. ఫిలిప్పీన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు ఈనెల 8వతేదీన మధిరలోని రామాలయం రోడ్డులోని తన ఇంటికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో థర్మల్‌స్ర్కీనింగ్‌ నిర్వహించుకొని ఆరోజు నుంచి హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్న అతడు సోమవారం సాయంత్రం నుంచి దగ్గు, జలుబుతో బాధపడుతుండగా మంగళవారం మధిర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. సదరు యువకుడితోపాటు అతని ఇద్దరు పిల్లలను పరిశీలించిన వైద్యులు జ్వరం లేకపోయినప్పటికీ దగ్గు, జలుబు ఉండటం, విదేశాల నుంచి రావడంతో ఇతర పరీక్షల నిమిత్తం ఖమ్మం తరలించారు.

Read more