గోవులు భారమా ?

ABN , First Publish Date - 2020-07-10T10:42:00+05:30 IST

భద్రాద్రి దేవస్థానానికి భక్తులు ఉదారంగా ఇచ్చిన గోవులు భారమయ్యాయట.. స్థలం సరిపోవడం లేదని, నిర్వహణ భారంగా మారిందనే నెపంతో

గోవులు భారమా ?

భద్రాచలం గోశాలలో  30ఆవులు

స్థలాభావంతో భారంగా గోశాల నిర్వహణ

కొన్ని ఆవులనుఉ పాల్వంచ గోశాలకు తరలించే యోచన  

ఆరంభ శూరత్వంగా శ్రీ గోకుల రామం నిర్మాణం


భద్రాచలం, జూలై 9: భద్రాద్రి దేవస్థానానికి భక్తులు ఉదారంగా ఇచ్చిన గోవులు భారమయ్యాయట.. స్థలం సరిపోవడం లేదని, నిర్వహణ భారంగా మారిందనే నెపంతో కొన్ని గోవులను పాల్వంచ గోశాలకు తరలించే యోచనలో దేవస్థానం అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దేవస్థానం ఆర్థిక స్తోమతకు మించి అధిక సంఖ్యలో ఉద్యోగులను పోషిస్తున్నా కేవలం పదుల సంఖ్యలో ఉన్న గోవులను పెంచేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదనే కారణాలు చూపడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.30 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన భద్రాద్రి దేవస్థానానికి కేవలం 30 గోవులున్న గోశాల నిర్వహణ భారంగా భావిస్తుండటం బాధాకరమని భక్తులు వాపోతున్నారు. గోశాలకు గోవులను, గడ్డిని ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చినా స్థలం లేకపోవడంతో తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం దేవస్థానం గోశాలలో 18 పెద్ద గోవులు, 8 చిన్న గోవులు ఉన్నాయి.


ఇటీవల నాలుగు గోవులు ప్రసవించడంతో  అసలు సమస్య తెరపైకి వచ్చినట్లు వినికిడి. లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఆలయంలో భక్తులకు స్వామి దర్శనం నిలిపివేయడంతో ఇటీవల వరకు వాటిని ఆలయంలోని చిత్రకూట  మండపం ముందు కట్టేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో భక్తులకు దర్శనం పునః ప్రారంభం కావడంతో సూపర్‌బజారు సెంటర్లోని గోశాలలో స్థలం సరిపోవడం లేదని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి భద్రాద్రి రామయ్యకు, అనుబంధ ఆలయాల్లోని స్వామి వార్లకు  నిత్యం వీటి నుంచి వచ్చే పాలను అభిషేకాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో స్థల సమస్య సాకుగా చూపి గోవులను పాల్వంచకు తరలించాలనే యోచనలో దేవస్థానం వర్గాలు ఉండటం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సైతం ఇదే రీతిలో భద్రాద్రి దేవస్థానం అధికారులు పలు ఆవులను పాల్వంచ గోశాలకు తరలించారు. తాజాగా మళ్లీ అదే యోచనలో దేవస్థానం అధికారులు ఉండటం పట్ల అందులో పని చేసే ఉద్యోగులే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 


శ్రీగోకులం ఆరంభ శూరత్వమేనా ?

భక్తులు, యాత్రికులు, ఆబాల గోపాలాన్ని ఆకుట్టకునేలా శ్రీ గోకులం రామం నిర్మించేందుకు దేవస్థానం అధికారులు గతంలో ప్రణాళికలు రూపొందించి దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదించారు. ఇందులో గోశాల, పార్కు, నక్షత్రవనం, రాశివనం, నవగ్రహ వనం(నవగ్రహాలకు సంబంధించిన మొక్కలను పెంచుతారు), కృష్ణుని విగ్రహం, మామిడి తోట, చెరువు, బోటింగ్‌తో పాటు రాత్రిపూట ఇక్కడ బస చేసేందుకు ఆసక్తి కనబరిచేవారి కోసం పది కుటీరాలను నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం 104 ఎకరాల దేవస్థానం భూమిని ఇప్పటికే ఎంపిక చేసి సిద్దం చేశారు. అన్నీ అనుకూలిస్తే గత ఏడాది జూన్‌ నాటికే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్న అధికారులు అనంతరం ఆ ఊసే మరిచారు.


గతంలో భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వహించిన పమెలా సత్పతి దేవస్థానం ఇన్‌చార్జ్‌ ఇవోగా కొద్దికాలం పని చేసిన సమయంలో  ఆమె ఇందుకు చొరవ తీసుకోగా అనంతరం వచ్చిన ఈవోలు ఈ విషయంపై ఆసక్తి చూపకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీగోకులం రామానికి రూ.కోటి విరాళం అందిస్తామని మైహోం సంస్థ యజమాని జూపల్లి రామేశ్వరరావు గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు గతంలో భద్రాచలం వచ్చిన ఆయన దేవస్థానం అధికారులకు ఇందుకు సంబంధించి మౌఖికంగా అంగీకారం తెలిపినట్లు దేవస్థానం వర్గాలు పేర్కొన్నాయి. దాత రూ.కోటి విరాళం ఇస్తామని ప్రకటించినా అనంతరం దానిపై దృష్టిసారించకపోవడం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు విమర్శిస్తున్నారు.

Updated Date - 2020-07-10T10:42:00+05:30 IST