కరోనా బారిన 206మంది

ABN , First Publish Date - 2020-08-18T11:19:04+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 206మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది.

కరోనా బారిన 206మంది

ఖమ్మం జిల్లాలో 92, భద్రాద్రి జిల్లాలో 64మందికి పాజిటివ్‌

సింగరేణిలో 50కేసులు నమోదు

కరోనా లక్షణాలతో ముగ్గురి మృతి


(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 206మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరిలో ఖమ్మం జిల్లాలో 92మంది ఉండగా, భదాద్రి కొత్తగూడెం జిల్లాలో 64 మంది ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లాలోని సింగరేణి ఏరియాలో జరిపిన పరీక్షల్లో 50 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. మొత్తంగా సోమవారం ఉమ్మడిజిల్లాలో 206 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 356మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా వారిలో 92మందికి పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే గతంలో కరోనా బారిన పడి  చికిత్స పొందుతున్న వారిలో 144మందిని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లా ఆసుపత్రిలో మరో 54మంది, మద్దులపల్లి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 27మంది వైద్యసేవలు పొందుతున్నట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.  చింతకాని మండలంలో ఏడుగురికి,  నేలకొండపల్లి మండలంలో ఏడుగురికి, వైరాలో 13మందికి, ఏన్కూరులో ఇద్దరికి, సత్తుపల్లిలో ఆరుగురికి, కల్లూరు మండలంలో నలుగురికి, తల్లాడ మండలంలో 11మందికి, కొణిజర్ల మండలంలో ముగ్గురికి లక్షణాలున్నట్టు నిర్ధారణైంది.


వీరితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 39మంది కొవిడ్‌ బారిన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం 190 పరీక్షలు నిర్వహించగా 64 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో తొమ్మిది మందికి, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 15మందికి, అశ్వారావుపేటలో ఆరుగురికి, దమ్మపేట మండలంలో ముగ్గురికి, ములకలపల్లి మండలంలో ఇద్దరికి, చర్ల మండలంలో నలుగురికి, ఇల్లెందులో ఎనిమిది మందికి, టేకులపల్లిలో ముగ్గురికి, చుంచుపల్లిలో ఒకరికి, అశ్వాపురంలో నలుగురికి, బూర్గంపాడులో ముగ్గురికి కరోనా నిర్ధారణైంది. వీరితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. 


సింగరేణిలో 50 పాజిటివ్‌ కేసులు 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు సింగరేణి ఏరియాల్లో సోమవారం నిర్వహించిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 50మందికి పాజిటివ్‌ వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో 55మందికి పరీక్షలు నిర్వహిస్తే ముగ్గురికి, కొత్తగూడెం ఏరియాలో 129 మందికి పరీక్షలు నిర్వహిస్తే 18 మందికి, మణుగూరులో 75మందికి పరీక్షలు నిర్వహిస్తే 22మందికి, సత్తుపల్లిలో 24మందికి పరీక్షలు నిర్వహిస్తే ఒకరికి, ఇల్లెందులో 50మందికి పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురికి కొవిడ్‌ లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. 


పెళ్లిజరిగిన ఇంట్లో అందరికీ..

ఇల్లెందులోని  ఓ సింగరేణి కుటుంబానికి చెందిన వారు ఆరుగురికి ఒకేరోజు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పట్టణంలోని జేకే కాలనీకి చెందిన ఓ సింగరేణి ఉద్యోగి ఇంట్లో వివాహ వేడుకలు జరగ్గా.. ఆ కుటుంబ సభ్యులకు సోమవారం పరీక్షలు నిర్వహించగా ఆ కుటుంబంలోని అందరికి పాజిటివ్‌ రావడంతో సింగరేణి హోంక్యారెంటైన్‌ కేంద్రంలోని ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. 


ముగ్గురి మృతి.. 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఇటీవల కరోనాతో మృతిచెందిన ఓ కిరాణా వ్యాపారి తండ్రి కూడా కొవిడ్‌ లక్షణాలతో ఖమ్మంలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి దాటాక మృతిచెందాడు. దీంతో మండలంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. తల్లాడ మండలానికి చెందిన ఓ యువకుడు (36) కరోనా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో చికిత్స పొందుతోంది. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు (60) వారం రోజులుగా కరోనాకు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-08-18T11:19:04+05:30 IST