ఆవేదన..ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-13T10:26:24+05:30 IST

అభివృద్ధి పనులు, అధికారుల నిర్లక్ష్యంపై అధికార పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆవేదన..ఆగ్రహం

 ప్రజాప్రతినిధులకు తెలియకుండానే అభివృద్ధి పనులా?

అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల మండిపాటు 

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలి

జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి

సిరిసిల్ల ఆస్పత్రిలో సిటీ స్కాన్‌ సేవలు 

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): అభివృద్ధి పనులు, అధికారుల నిర్లక్ష్యంపై అధికార పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మండలాల్లో జరుగుతున్న అభి వృద్ధి పనుల సమాచారం కూడా ఉండడం లేదని మండిపడ్డారు. రైతు వేదికల నిర్మాణాలను ఆర్భాటంగా ప్రారంభించినా పనుల నత్తనడకపై ప్రశ్నించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శనివారం చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, పంచాయతీశాఖ, అటవీ, మిషన్‌భగీరథ, ఇంజనీరింగ్‌,  వైద్య, ఆరోగ్యం, సెస్‌ తదితర శాఖల ప్రగతిపై  చర్చించారు. 


కోనరావుపేటలో రైతు వేదికల నిర్మాణాలు బేస్‌మీట్‌ వరకే జరిగాయని, పనిచేయని కాంట్రాక్టర్‌లకు ఎందుకు ఇచ్చారని కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య ప్రశ్నించారు. వేములవాడ రూరల్‌ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ  యూరియాకే దిక్కులేదని, రైతు వేదికలు ఎందుకని ధ్వజమెత్తారు. నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ప్రజాప్రతినిధులకు ఉండడం లేదన్నారు. ఫాజుల్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు  విద్యుత్‌సౌకర్యం లేదన్నారు. గ్రామాల్లోని చెరువుల్లో శ్మశాన వాటికలు నిర్మించడంతో  నీటిలో మునుగుతున్నాయన్నారు. ఇంకుడుగుంతల డబ్బులు రాలేదన్నారు. వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి సమాధానమిస్తూ రైతు వేదికల నిర్మాణాలకు సంబంధించి 57 క్టస్టర్‌లకు స్థల సేకరణ పూర్తయిందని నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, జిల్లాకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల నుంచి 5 వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా వచ్చిందని అన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే తమ దృష్టికి తీసుకరావాలన్నారు.


రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంతో  రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయాలని అన్నారు. రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపరాణి మాట్లాడుతూ మానాలలో గేదెలు చనిపోతున్నాయని,  పశువైద్యాధికారిని కారణమడిగితే  నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని  అన్నారు. పశు వైద్యానికి సంబంధించిన వ్యాక్సిన్‌లు, మందులు లేవని, ప్రైవేటులో తెచ్చుకోవాలంటున్నారని  అన్నారు. ఏదైనా  అడిగితే ఏడవడం, బాధపడడం చేస్తున్నారని పనులు మాత్రం జరగడం లేదని అన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు మాట్లాడుతూ కాలువల నిర్మాణాల్లో   భూములు కోల్పోయినవారితోపాటు ఆ సర్వే నంబరులో ఉన్న వారికి రైతు బంధు రావడం లేదని దానిని పరిశీలించాలని అన్నారు. మండలాల్లో నిర్మించిన శ్మశాన వాటికలకు విద్యుత్‌ కనెక్షన్లు  ఇవ్వాలన్నారు. సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిపాదనలు, నిధులు మంజూరు చేస్తే వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ రుద్రంగి, మానాల ప్రాంతాల వారు కొవిడ్‌ పరీక్షలకు చందుర్తి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, రుద్రంగి మండల కేంద్రంలో కొవిడే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.


తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల మాట్లాడుతూ బస్వాపూర్‌లో చెక్‌ డ్యాం పాడై సంవత్సరం గడిచిపోతోందని, మరమ్మతు చేయాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. చీర్లవంచకు చెందిన ఆరోగ్య కేంద్రాన్ని అగ్రహారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఏర్పాటు చేశారని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడి ఆరోగ్య కేంద్రాన్ని చీర్లవంచ కాలనీకి మార్చాలని కోరారు. లక్ష్మీపూర్‌ తంగళ్లపల్లి మధ్య బ్రిడ్జి నిర్మించాలని అన్నారు. వర్షం కురిసిన ప్రతీసారి కాజ్‌వే కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీర్నపల్లి ఎంపీపీ మాలోతు బూల మాట్లాడుతూ డబుల్‌ రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు నిలిచిపోయాయని, వెంటనే పూర్తి చేయాలని కోరారు. కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య మాట్లాడుతూ తన మండలంలో చెక్‌డ్యాంలు నిర్మిస్తున్న సంగతి తనకే తెలియదని ఎమ్మెల్యే ఫోన్‌ చేసి పనులు చూసిరమ్మని చెప్పారని అన్నారు. ప్రజాప్రతినిధులకు చెప్పకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చెక్‌డ్యాంల నిర్మాణం ప్రజాప్రతినిధులకే తెలియకుంటే తాము ఎందుకు ఉన్నట్లని ప్రశ్నించారు.  రైతు బంధు రావడం లేదని పాస్‌బుక్కులు చూసి ఇవ్వాలని అన్నారు.


పొలాల్లో కల్లాలు కట్టుకున్నా డబ్బులు రాలేదని, తనకే రాలేదని అన్నారు. ముస్తాబాద్‌ ఎంపీపీ శరత్‌రావు మాట్లాడుతూ వర్షాలు కురవడంతో పంటలకు తెగుళ్లు సోకుతున్నాయని, వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరారు. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లా వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని అన్నారు. కొవిడ్‌ బాధితులకు వైద్యాధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను సభ్యులు కొనియాడారు.   సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, డీసీఎంస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్లు  అంజయ్య, సత్యప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌బాషా, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


సమన్వయంతో పనిచేయాలి.. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో   పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. కలిసికట్టుగా పనిచేసినపుడే క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కాంక్షించి అనేక కార్యక్రమాలు, పథకాలను  అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను చేపట్టే క్రమంలో ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని, వారిని తప్పనిసరిగా ఆహ్వానించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలను తెలియజేస్తే వెంటనే స్పందిచాలన్నారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణం పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను త్వరితగతిన చెల్లించాలన్నారు.  ప్రగతిలో ఉన్న చెక్‌డ్యాం నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు.


రుద్రంగి మండలంలో గేదెల మృత్యువాతపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. జిల్లాలో రైతు వేదికలు, వైకుంఠధామాలకు విద్యుత్‌సౌకర్యం కల్పించాలన్నారు. మిషన్‌భగీరథ ద్వారా వేసవి కాలంలోగా వంద శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అత్మస్థయిర్యం నింపేందుకు కృషి చేయాలని అన్నారు. 


కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు ..కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

జిల్లాలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని, త్వరలోనే జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకరానుందని  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో అమెరికా, లండన్‌లో ఉపయోగిస్తున్న రెమిడెసివర్‌ వంటి ఇంజక్షన్లు, మిథైల్‌ ప్రెజీమీలోన్‌, వంటి మందులను సైతం  ప్రభుత్వం జిల్లా కేంద్రం ప్రధాన ఆస్పత్రిలో అందుబాటులో ఉంచిందన్నారు. వైద్యుల సలహా మేరకు వాటి అవసరం ఉన్న బాధితులకు ఇస్తామన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిదులు, వైద్యాధికారులకు సహకారం అందించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ వార్డు ఉన్న దృష్ట్యా ప్రసూతి, విభాగాన్ని అనువైన ఇతర ప్రదేశంలోకి మారుస్తామన్నారు. కొవిడ్‌ బాధితులకు వెంటిలేటర్‌ కంటే మరింత మెరుగైన సేవలు అందించేదుకు, ఆక్సిజన్‌ను నేరుగా ఊపిరి తిత్తులోకి పంపించేందుకు రెండు హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ పరికరాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 


ప్రణబ్‌ ముఖర్జీకి నివాళి  

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సమావేశం నివాళి తెలిపింది. సమావేశం ప్రారంభానికి ముందే సభ్యులు, అధికారులు రెండు నిముషాలు మౌనం పాటించారు. 

Updated Date - 2020-09-13T10:26:24+05:30 IST