హత్యాయత్నం కేసులో జడ్పీ చైర్మన్‌కు ఊరట

ABN , First Publish Date - 2020-09-01T07:29:48+05:30 IST

హెచ్‌ఎంఎస్‌ నాయకుడు అంబటి నరేష్‌ ఇంటిపై దాడి చేసి, అతడి కూతురు నిహర్షను గాయపర్చారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుపై గోదావరిఖని వన్‌టౌన్‌లో నమోదైన

హత్యాయత్నం కేసులో జడ్పీ చైర్మన్‌కు ఊరట

కోల్‌సిటీ, ఆగస్టు 31: హెచ్‌ఎంఎస్‌ నాయకుడు అంబటి నరేష్‌ ఇంటిపై దాడి చేసి, అతడి కూతురు నిహర్షను గాయపర్చారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుపై గోదావరిఖని వన్‌టౌన్‌లో నమోదైన హత్యాయత్నం కేసు నుంచి ఆయనకు ఊరట ల భించింది. న్యాయవాది గట్టు వామన్‌రావు ఇచ్చిన ఫిర్యాదే తప్పుడు ఫిర్యాదు అని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


జూన్‌ 2వ తేదిన సింగరేణి ఓసీపీ-2లో జరిగిన ప్రమాదం విషయంలో హెచ్‌ఎంఎస్‌ నాయకుడు రియాజ్‌ అహ్మద్‌ను జెడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధు, టీఆర్‌ఎస్‌ నాయకుడు పూదరి సత్యనారాయణలు తిట్టారని, దీన్ని సవాల్‌ చేస్తూ అంబటి నరేష్‌ పత్రికా సమావేశం నిర్వహించారని ఏసీపీ పేర్కొన్నారు.


ఈవిషయమై జూన్‌ 8న పూదరి సత్యనారాయణ, అతని అనుచరులు అంబటి నరేష్‌ ఇంటిపై దాడి చేసి, కారు అద్దాలు పగులగొట్టి అతడి కూతురు నిహర్షను గాయపర్చారని, వారిపై చర్య తీసు కోవాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుతో పాటు సత్యనారాయణ, మరికొందరిపై చర్య తీసుకోవాలంటూ హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు ఈ మెయిల్‌ ద్వారా రామగుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.


ఈ ఫిర్యాదు ఆధారంగా పుట్టమధు, పూదరి సత్యనారాయణ, మరికొందరిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. జూన్‌9న అంబటి నరేష్‌ భార్య కూడా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పూదరి సత్యనారయణ, మరికొందరిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రామగుండం సీఐ కరుణాకర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు ఫిర్యాదులపై రామగుండం సీఐ నిస్పక్షపాత విచారణ జరిపించారని, ఫిర్యాదుదారు వామన్‌రావుకు నోటీసులు పంపించి విచారణకు రమ్మని, సాక్ష్యాలను చూపించమని చెప్పినా ఇంత వరకు విచారణాధికారి ముందు హాజరుకాలేదన్నారు.


ఫిర్యాదుదారు గట్టు వామన్‌రావు సాక్షి, బాధితుడు కానందున కేవలం నరేష్‌ భార్య జ్యోతి ఇచ్చిన కేసులోనే విలీనం చేసి విచారణ జరిపామన్నారు. ఈ విచారణలో అంబటి నరేష్‌ ఇంటి వద్దకు పూదరి సత్య నారాయణ, అతని మనుషులు వచ్చి గొడవచేసిన మాట వాస్తవమేకానీ, ఇంటి మీదకు ఎవరూ రాళ్లు విసరలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. నరేష్‌ కూతురు నిహర్షను పంపేందుకు నరేష్‌ నిరాకరించాడన్నారు. ఘటన జరిగిన మూడు రోజు ల తరువాత ఆమెను ప్రభుత్వాసుపత్రికి పంపి పరీక్ష చేయించగా అది మూడు రో జుల క్రితం గాయం కాదని, తాము పరీక్షించిన సమయానికి 6 నుంచి 12గంటల మధ్య గల గాయంగా డాక్టర్లు నివేదిక ఇచ్చారన్నారు.


అసలు నరేష్‌ భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదులో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ప్రస్తావన కానీ, ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం కానీ ఉన్నట్టు పేర్కొనలేదన్నారు. తమ విచారణలో పుట్ట మధు ఎలాంటి నేరం చేయకున్నా వామన్‌రావు దురుద్దేశ్యంతో కావాలని తప్పుడు ఫిర్యాదుచేసినట్టు ఏసీపీ ఉమేందర్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-01T07:29:48+05:30 IST