యాసంగి షురూ..

ABN , First Publish Date - 2020-12-07T05:55:28+05:30 IST

సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి సాగును రెట్టింపు చేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రబీ సాగు కంటే 33,169 ఎకరాల్లో అదనంగా పంటలు వేయనున్నారు. ప్రస్తుత యాసంగి సాగులో 1,62,777 ఎకరాల్లో వివిధ పంటలు వేయ నున్నట్లు వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ రూపొం దించింది.

యాసంగి షురూ..
సిరిసిల్ల పెద్దూర్‌లో భూమి దున్నుతున్న రైతు

- జిల్లాలో నారు మడులు సిద్ధం

- కోతలతో రైతుల బిజీ బిజీ

- జిల్లాలో రబీలో 33,169 ఎకరాలు అదనంగా సాగు అంచనా 

- జిల్లాలో 1,62,777 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు ప్రణాళిక

- వరి 1,51,817 ఎకరాల్లో సాగుకు సిద్ధం 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో  రైతులు యాసంగి సాగును రెట్టింపు చేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రబీ సాగు కంటే 33,169 ఎకరాల్లో అదనంగా పంటలు వేయనున్నారు. ప్రస్తుత యాసంగి సాగులో 1,62,777 ఎకరాల్లో వివిధ పంటలు వేయ నున్నట్లు వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ రూపొం దించింది. ఇందులో అధికంగా 1,51,817 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు.     రైతులు నారుమడులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.   390 ఎకరాల వరకు నాట్లువేయడం మొదలు పెట్టారు.  అల్పపీడన ప్రభావంతో ఈ సారి చెరువులు, కుంటలు నిండాయి. నీటి నిల్వలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నుంచి అక్టోబరు చివరి వరకు వర్షాలు విస్తారంగా కురవడంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నీరు సమృద్ధిగా ఉండడంతో పంటలు బాగా పండుతాయనే భరోసాతో రైతులు యాసంగి పనుల్లో మునిగిపోయారు. ఇందుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, సమకూర్చుకుంటున్నారు.ఈ సారి సన్నరకాలు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ అధికారులు కూడా సన్నరకాలు వేసుకునే విధంగా రైతులపై ఒత్తిడి తేకపోవడం గమనార్హం.


1,62,777 ఎకరాల్లో యాసంగి సాగు 

 జిల్లాలో 1,62,777 ఎకరాల్లో యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. ఇందులో వరి 1,51,817 ఎకరాలు,  మొక్కజొన్న 4,200, శెనగ 1850, వేరుశెనగ 1600, పెసర 1200, మినుములు 380, నువ్వులు 690, గోధుమ 145, జొన్నలు 56, చిరు ధాన్యాలు 90, పొద్దు తిరుగుడు 15,  ఇతర పంటలు 634 ఎకరాల్లో సాగు చేయడానికి సిద్ధమయ్యారు. 


40,100 మెట్రిక్‌ టన్నుల ఎరువులు 

జిల్లాలోని యాసంగి సాగుకు 40,100 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. అందుకు అనుగుణంగా ఎరువులను సిద్ధం చేస్తున్నారు. యూరియా 21,000 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 5500 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4 వేల మెట్రిక్‌ టన్నులు, కాంఫ్లెక్స్‌ ఎరువులు 9 వేల మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌వీ 4100 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఎరువుల వినియోగంలో నవంబరులో 5600  మెట్రిక్‌ టన్నులు, డిసెంబరులో 8400 మెట్రిక్‌ టన్నులు, వచ్చే సంవత్సరం జనవరిలో 13250 మెట్రిక్‌ టన్నులు, ఫిబ్రవరిలో 8500 మెట్రిక్‌ టన్నులు, మార్చిలో 2600 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రైతులు వినియోగిస్తారని అంచనా వేశారు. 


1,15,166 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు 

జిల్లాలో  వానాకాలం సాగు కోతలతోపాటు ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలతో రైతులు బిజీగా మారారు.  ఇప్పటి వరకు 227 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,66,68 మంది రైతుల నుంచి 1,19,543 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 30,484 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 82,875 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 2,321 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 1054 మెట్రిక్‌టన్నులు, మార్కెట్‌ యార్డుల ద్వారా 2,807 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రూ.225.63 కోట్ల విలువైన ఽధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.136.46 కోట్లు జమ చేశారు. 

Updated Date - 2020-12-07T05:55:28+05:30 IST