ఆ పంచాయతీల్లో ఉపఎన్నికలు జరిగేనా..?

ABN , First Publish Date - 2020-12-18T04:48:10+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఎన్నికల ఖర్చును సమర్పించని 142 వార్డు సభ్యులపై అనర్హత వేటుపడింది.

ఆ పంచాయతీల్లో ఉపఎన్నికలు జరిగేనా..?

- జిల్లాలో 142 వార్డు సభ్యులపై అనర్హత వేటు

- వారిలో పది మంది ఉపసర్పంచులు

- కోర్టును ఆశ్రయించిన పలువురు సభ్యులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఎన్నికల ఖర్చును సమర్పించని 142 వార్డు సభ్యులపై అనర్హత వేటుపడింది. ఇందులో పదిమంది ఉపసర్పంచులు ఉండడం గమనార్హం. అయితే వీరిపై వేటు పడినప్పటికీ వాళ్లు గెలుపొందిన వార్డు స్థానాలకు తిరిగి ఉపఎన్నికలు నిర్వహిస్తారా, లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2019 జనవరిలో జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్‌ స్థానాలకు, 2,436 వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా 5వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు 50 వేల వరకు, 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో 30 వేల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపే ఖర్చులను సమర్పించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. కానీ చాలా మంది గడువులోపు ఎన్నికల ఖర్చు వివరాలను అందజేయలేదు. వారికి సంఘం నోటీసులు జారీ చేసింది. వాటికి వార్డు సభ్యులు వివరణలు సమర్పించారు. వాటితో సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం జిల్లాలో 142 వార్డు సభ్యులపై అనర్హత వేటు వేసింది. ఇందులో పది మంది వార్డు సభ్యులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీలకు ఉపసర్పంచులుగా వ్యవహరిస్తున్నారు. వీరిపై అనర్హత వేటు పడడంతో జాయింట్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేశారు. 

పెద్దపల్లి మండలంలోనే అధికంగా..

పెద్దపల్లి మండలం దేవునిపల్లి పంచాయతీ మినహా అదే మండలంలోని భోజన్నపేట్‌, చీకురాయి, కనగర్తి, కాసులపల్లి, మూలసాల, నిమ్మనపల్లి, పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌, జీడీనగర్‌, కుక్కలగూడూరు పంచాయతీల్లో మరొక వార్డు సభ్యుడికి చెక్‌ పవర్‌ను ఇచ్చారు. పెద్దపల్లి మండలం దేవునిపల్లి పంచాయతీల్లో ఉన్న ఎనిమిది మంది వార్డు సభ్యులపై అనర్హత వేటు పడడంతో సర్పంచ్‌తో జాయింట్‌ చెక్‌ పవర్‌ను పంచాయతీ కార్యదర్శికి ఇచ్చారు. అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 86 మందిపై వేటు పడడం గమనార్హం. మండలంలోని దేవునిపల్లి పంచాయతీలో 8 మందిపై, అందుగులపల్లిలో ఇద్దరు, అప్పన్నపేట్‌లో ఒకరు, భోజన్నపేట్‌లో ఏడుగురు, బొంపెల్లిలో ముగ్గురు, బ్రాహ్మణపల్లిలో ఇద్దరు, చీకురాయిలో నలుగురు, గోపయ్యపల్లిలో నలుగురు, కనగర్తిలో ఎనిమిది, కాపులపల్లిలో నలుగురు, కాసులపల్లిలో 9 మంది, కుర్మపల్లిలో ఏడుగురు, మారేడుగొండలో ఒకరు, మూలసాలలో ఐదుగురు, ముత్తారంలో ఆరుగురు, నిమ్మనపల్లిలో ఒకరు, పాలితంలో ఆరుగురు, పెద్దబొంకూర్‌లో ముగ్గురు, పెద్దకల్వలలో ఒకరు, రాఘవాపూర్‌లో ఒకరు, రాగినేడులో ఇద్దరు, రంగాపూర్‌లో ఒక వార్డు సభ్యుడిపై వేటు పడింది. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో ముగ్గురు, ఆసంపేటలో ముగ్గురు, మద్దిర్యాలలో ఒకరు, ముర్మూరులో ఒకరు, పొట్యాలలో ఇద్దరు వార్డు సభ్యులు, ఓదెల మండలం మడకలో ఇద్దరు, పొత్కపల్లిలో ఒకరు, రూప్‌నారాయణపేటలో ఒకరు, ఉప్పరపల్లిలో ఇద్దరిపై వేటు పడింది. పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో ముగ్గురు, జీడీ నగర్‌లో ముగ్గురు. గుడిపల్లిలో ఇద్దరు, జయ్యారంలో ఐదుగురు, కొత్తపల్లిలో ఒకరు, కుక్కలగూడూరులో ఐదుగురు, పుట్నూరులో ఒకరు, రామారావుపల్లిలో ఒకరు, రాణాపూర్‌లో ఇద్దరు వార్డు సభ్యులపై వేటు పడింది. సుల్తానాబాద్‌ మండలంలో చిన్న బొంకూర్‌లో ఒకరు, చిన్న కల్వలలో ఇద్దరు, దుబ్బపల్లిలో ఒకరు, గర్రెపల్లిలో ఒకరు, నీరుకుల్లలో ఒకరు, సుద్దాలలో ఒకరు, జూలపల్లి మండలంలో చీమలకుంటలో ఒకరు, జూలపల్లిలో ఒకరు, కాచాపూర్‌లో ఒకరు, కీచులాటపల్లిలో ఇద్దరు, కోనరావుపేటలో ఒకరు, పెద్దాపూర్‌లో ఇద్దరు, వడుకాపూర్‌లో ఇద్దరు వార్డు సభ్యులపై వేటు పడింది. అనర్హత వేటు పడిన వారిలో పలువురు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం ఇప్పటి వరకు వారి అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొన్నది.

Updated Date - 2020-12-18T04:48:10+05:30 IST