-
-
Home » Telangana » Karimnagar » Will Sridharbabu get the TPCC seat
-
శ్రీధర్‌బాబుకు టీపీసీసీ పీఠం దక్కేనా?
ABN , First Publish Date - 2020-12-06T06:00:13+05:30 IST
ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆ పదవి దక్కుతుందా లేక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

అధ్యక్ష పదవా, వర్కింగ్ ప్రెసిడెంటా?
జిల్లాలో చర్చనీయాంశం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆ పదవి దక్కుతుందా లేక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ స్థానానికి మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పోటీలో ఉన్నట్లు సమాచారం. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందిన అనంతరమే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావించింది. దీంతో నేతల మధ్య పోటీ తీవ్రమయ్యింది. దీంతో వెనక్కి తగ్గిన ఏఐసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే కొనసాగిస్తూ వచ్చింది. అదే సమయంలో అధ్యక్ష పదవికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్‌బాబుకు టీపీసీసీ పీఠం కట్టబెడుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎవరిని నియమించలేదు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో పరాజయం పాలవుతున్న కాంగ్రెస్ ఈ సమయంలో కూడా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించకపోతే పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9లోపు నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. పార్టీకి విధేయుడిగా ఉన్న శ్రీధర్‌బాబుకే టీపీసీసీ పదవి కట్టబెట్టనున్నారని తెలిసింది. టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇస్తే శ్రీధర్‌బాబుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.