ఎందుకీ మౌనం.. బీజేపీ స్పందించకపోవడంపై చర్చ
ABN , First Publish Date - 2020-08-12T20:08:36+05:30 IST
బొమ్మకల్ భూకబ్జాల అంశం నేపథ్యంలో బీజేపీ వైఖరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఈ వ్యవహారంపై పరిశీలన జరపడానికి కమిటీని నియమించినా భారతీయ

జిల్లా కేంద్రం పరిసరాల్లో వెలుగుచూస్తున్న భూకబ్జాలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్): బొమ్మకల్ భూకబ్జాల అంశం నేపథ్యంలో బీజేపీ వైఖరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఈ వ్యవహారంపై పరిశీలన జరపడానికి కమిటీని నియమించినా భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీ వైపు మళ్ళింది. బీజేపీ నగర అధ్యక్షుడు ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా గవర్నర్‌కు, ఇతర రాజ్యాంగ సంస్థలకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా జిల్లా శాఖ నుంచి గానీ రాష్ట్రశాఖ నుంచిగానీ ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆపార్టీలో ఏమి జరుగుతుందనే చర్చ మొదలైంది.
అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చినా..
కరీంనగర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములపై భూ కబ్జాదారుల దృష్టిపడి బొమ్మకల్, రేకుర్తి, సీతారాంపూర్, తీగెలగుట్టపల్లి, చింతకుంట, ఆరెపల్లి తదితర గ్రామాల్లో అక్రమాల పర్వం కొద్ది ఏళ్లుగా కొనుసాగుతున్నది. తాజాగా బొమ్మకల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బొమ్మకల్‌లో జరిగిన భూ ఆక్రమణల వెనుక అధికారపార్టీకి చెందిన నేతను పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా అతని వెనుకాల మరికొంత మంది కూడా ఉన్నారని అనుమానిస్తూ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద గ్రామానికి చెందిన ఒక యువకుడు సేకరించి ప్రజల దృష్టికి తీసుకురాగా బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఆ విషయాలను పోస్టు చేయడంతోపాటు గవర్నర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా కూడా మారింది. టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాల వెనుక ఉన్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నదని మహేందర్‌రెడ్డి ఫిర్యాదుతో అందరూ భావించారు. కానీ కొద్ది రోజుల్లోనే ఈ వ్యవహరం బీజేపీనే ప్రశ్నించే విధంగా మారింది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌కుమార్, జిల్లాశాఖ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు ఈ విషయంపై స్పందించక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
అంతర్గత విభేదాలే కారణమా..?
ఆ పార్టీకి చెందిన నగరశాఖ అధ్యక్షుడు లేవనెత్తిన అంశంపట్ల ఆ పార్టీ నుంచే స్పందన లేక పోవడం వారి మధ్య సమన్వయం ఉందా లేదా అంతర్గత విబేధాలు ఉన్నాయా అన్న చర్చకుదారితీస్తున్నది. భూఆక్రమణాలపై రోజుకో వర్గం ప్రెస్మీట్లు పెడుతూ వివరాలు వెల్లడిస్తున్నాయి. భూకబ్జాల బాధితులు సంఘం పెట్టుకొని లోక్‌సత్తా ఉద్యమసంస్థతో కలిసి పలుని రసనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో బొమ్మకల్ సర్పంచు అరెస్టు కాగా ఆయన అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. భూ మాఫియాతో సంబంధం ఉన్న వారిపై కలెక్టర్ శశాంక నియమించిన కమిటీతోపాటు పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు సీపీ కమలాసన్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ఈ వ్యవహారంపై దృష్టిసారించి రిపోర్టులు తెప్పించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ కానీ, బీజేపీగానీ ఎందుకు స్పందించడం లేదనే చర్చ ప్రజల్లో బయలు దేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పత్రికా సమావేశంలో విచారణకు డిమాండ్ చేయగా, బీజేపీలో కనీస స్పందన కూడా లేదని, రాష్ట్ర అధ్యక్షుడే ఇక్కడి నుంచి ఉన్నా ఈ విషయమే పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కల్పిస్తున్నదని అంటున్నారు. బొమ్మకల్ భూముల వ్యవహారంతో సంబంధమున్న రాజకీయ నాయకుడు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నా గతంలో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడని, అతను ఆకారణంగానే ఈవిషయంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న వారిలో కొందరికి ఈ భూ వ్యవహారాలతో సంబంధం ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.