సన్నాల పంపిణీపై స్పష్టతేది?

ABN , First Publish Date - 2020-12-16T04:55:44+05:30 IST

రేషన్‌ షాపుల్లో జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. అధికారులు మాత్రం మిగిలి ఉన్న సన్న బియ్యాన్ని ఒక నెల లేదా మరో నెల పంపిణీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

సన్నాల పంపిణీపై స్పష్టతేది?
సిరిసిల్లలోని పాఠశాలలో వేపాకులు చల్లి ఉంచిన బియ్యం నిల్వలు

- జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు 

- 1,72,826 రేషన్‌ కార్డులు 

- ప్రతి నెలా 3,281 టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ

- జిల్లాకు 700 టన్నుల సన్నబియ్యం కేటాయింపు 

- పాఠశాలల్లో ముక్కిపోతున్న 103 టన్నుల సన్నబియ్యం 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రేషన్‌ షాపుల్లో జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. అధికారులు మాత్రం మిగిలి ఉన్న సన్న బియ్యాన్ని ఒక  నెల లేదా మరో నెల పంపిణీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పంపిణీకి సరిపడే సన్న బియ్యం కూడా జిల్లాల్లో లేకపోవడంతో   ఎవరికి ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు ఉండగా 1,72,826 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 5,02,733 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 32 లక్షల 81 వేల 134 కిలోల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని చెప్పడంతో రేషన్‌ డీలర్లు తమవద్ద ఉన్న దొడ్డు బియ్యం పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 700 టన్నుల సన్నబియ్యాన్ని కేటాయించారు. కానీ జిల్లాలో లబ్ధిదారులకు ప్రతి నెలా 3,281 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండడంతో 700 టన్నులు పంపిణీ చేసే అవకాశం లేదు. దీంతో సన్నరకం బియ్యం వచ్చిన తరువాత ఫిబ్రవరి నుంచి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. కొత్త సన్నబియ్యం వచ్చినా రెండు మూడు నెలలకు మించి పంపిణీ చేయలేరని తెలుస్తోంది. వానాకాలం సాగులో సన్నరకం సాగు చేసిన రైతులు మద్దతు ధర లేకపోవడంతో యాసంగిలో సన్నరకం వైపు మొగ్గు చూపడం లేదు. దీంతో జిల్లాలో సన్నరకం బియ్యం పంపిణీ అయోమయంగా మారింది. దొడ్డురకం బియ్యాన్ని ఎఫ్‌సీఐకు కేటాయించి సన్నరకాన్ని సివిల్‌ సప్లయీస్‌ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 9,132 టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. ఈ బియ్యం పంపిణీ కూడా రెండు నెలలకు సరిపోతుంది. దీంతో ప్రస్తుతం జిల్లాకు వచ్చిన 700 టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసే పరిస్థితి లేదు. వచ్చే సన్నబియ్యం కేవలం సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు పరిమితం చేస్తే ఇతర లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయని భావిస్తున్నారు. మరోవైపు జిల్లాలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యంపై స్పష్టత లేకపోవడంతో రేషన్‌ డీలర్లు, అధికారులు అయోమయంలో ఉన్నారు.


నిల్వ బియ్యానికి ముక్క 

కొవిడ్‌ నేపఽథ్యంలో పాఠశాలలు మూతబడి అన్‌లైన్‌ విధానం కొనసాగుతోంది. దీంతో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. మార్చిలో లాక్‌డౌన్‌తో మూతబడిన సమయంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం నిల్వ ఉంచిన బియ్యం ముక్క పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 512 పాఠశాలలు ఉండగా ఇందులో 499 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలల్లో 103 టన్నుల బియ్యం నిల్వ ఉన్నాయి. సెప్లెంబరులో అధికారులు తీసిన లెక్కల ప్రకారం 10 టన్నుల బియ్యం పూర్తిగా పాడుకాగా 16 టన్నులు పాక్షికంగా పాడైనట్లుగా లెక్కలు చూపారు. కానీ సగానికి పైగా బియ్యంపాడైపోయి  ముక్క వాసన వస్తున్నట్లు తెలుస్తోంది.  పాఠశాలల్లో బియ్యం పాడు కాకుండా వేపాకులు, బోరిక్‌యాసిడ్‌ పౌడర్‌ చల్లి ఉంచారు. ప్రస్తుతం ఈ బియ్యం  ఏం చేయాలో స్పష్టత  లేదు.  జిల్లాలో 512 పాఠశాలలు ఉండగా ఇందులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 111, ప్రాథమిక పాఠశాలలు 339, ప్రాథమికోన్నత పాఠశాలలు 39, కేజీబీవీలు 13, మోడల్‌ స్కూల్‌లు 7, వెల్ఫేర్‌ పాఠశాల ఒకటి,  మరొకటి బ్రిడ్జి స్కూల్‌, ఒక ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. మొత్తం 30,691 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 3వ తరగతి చదువుతున్నారు 3,658 మంది, 4వ తరగతిలో 3,797 మంది, 5వ తరగతిలో 3,904 మంది, 6వ తరగతిలో 3,353 మంది, 7వ తరగతిలో 3,988 మంది, 8వ తరగతిలో 3,936 మంది, 9వ తరగతిలో 3,961 మంది, పదవ తరగతిలో 4,094 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం ఇప్పట్లో ప్రారంభయ్యే పరిస్థితి లేకపోవడంతో బియ్యం పూర్తిగా అక్కరకు రాకుండా మారే పరిస్థితి ఉందని తెలుస్తోంది. 

Read more