నెరవేరని ఎన్నికల హామీలు

ABN , First Publish Date - 2020-12-13T05:48:52+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా, తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సందర్భంగా చేపట్టిన పనులు నేటికీ పూర్తికావడం లేదు.

నెరవేరని ఎన్నికల హామీలు
ఓడెడు వద్ద మానేరు వాగుపై నిలిచిపోయిన వంతెన పనులు

- గతంలో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాని వైనం

- జిల్లాకు ప్రత్యేకించి నిధులను విడుదల చేయని ప్రభుత్వం

- రామగుండంలో మెడికల్‌ కళాశాల హుళక్కే..

- పెద్దపల్లిలో కార్యరూపం దాల్చని బస్‌డిపో, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

- ఏళ్లు గడుస్తున్నా మానేరుపై పూర్తి కాని వంతెనల నిర్మాణం

- మలి విడత టీఆర్‌ఎస్‌ రెండేళ్ల పాలన తీరు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా, తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సందర్భంగా చేపట్టిన పనులు నేటికీ పూర్తికావడం లేదు. నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరో ఎనిమిది మాసాల పాటు అధికారం ఉండగానే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి 2018 డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలను నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రం మారింది. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి రెండోసారి గెలుపొందగా, మంథని నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గెలుపొందారు. రామగుండం నుంచి టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోరుకంటి చందర్‌ విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోగా, జిల్లా అభివృద్ధికి ప్రత్యేకించి నిధులు మంజూరు చేసింది లేదు. గత పాలనలో చేపట్టిన పనులు నిధులు లేక పెండింగులోనే ఉన్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం తొలి ఏడాది నిధులు ఇవ్వకపోగా, రెండో ఏడాది మంజూరుచేసినా వాటిని కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వినియోగించేందుకు ప్రభుత్వానికి ఇచ్చారు. మలివిడత టీఆర్‌ఎస్‌ పాలన ముగిసి రెండేళ్లు గడుస్తున్న సందర్భంగా జిల్లాలో అభివృద్ధి తీరు తెన్నులు, నేతల హామీలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.. 

హామీలకే పరిమితమైన ఆర్టీసీ బస్‌డిపో..

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందిన దాసరి మనోహర్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. అవి నేటికీ నెరవేరడం లేదు. ప్రధానంగా పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్‌డిపోను ఏర్పాటు చేయిస్తానని, నియోజకవర్గానికి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను తీసుకవస్తానని, అన్ని మండల కేంద్రాల్లో మినీస్టేడియాలతో పాటు జిల్లా కేంద్రంలో స్టేడియం, కన్వెన్షన్‌ సెంటర్‌ను మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రధాన దేవాలయంగా పేరొందిన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకవస్తానని, జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. నియోజకవర్గంలో 5 వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ఎమ్మెల్యే, గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలనే పూర్తి చేయించలేకపోతున్నారు. నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన ఎస్సీ, బీసీ, మైనార్టీ, అర్బన్‌ గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణాలు జరగలేదు. ఆయా గ్రామాలకు డబుల్‌ రోడ్లు నిర్మిస్తామని, ప్రతి గ్రామంలో మహిళా సంఘం భవనంతో పాటు మినీ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణాలను చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మానేరువాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చెక్‌డ్యామ్‌లను మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉన్నది. రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైన ధూళికట్టలో గల బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దలేకపోతున్నారు. పెద్దపల్లి మున్సిపల్‌ అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం 50కోట్ల రూపాయలు మంజూరు చేయగా, నేటికీ ఆ పనులను పూర్తిచేయడం లేదు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన నిర్మాణం నిలిచిపోగా, మున్సిపల్‌ కార్యాలయం, కూరగాయల మార్కెట్‌, మాంసం, చేపల మార్కెట్లు, వైకుంఠధామాలు, ఇతరత్రా అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదు. కేవలం వీధుల్లో సీసీరోడ్లు, ప్రధాన రహదారిపై డివైడర్లతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌, ఇరువైపులా విద్యుత్తు టవర్లను నిర్మించారు. నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వరదకాలువ నుంచి కాకతీయ కాలువకు నేరుగా సరఫరా చేసేందుకు 36 కోట్లతో చేపట్టిన లింకు కాలువ పనులు రెండేళ్లుగా నడుస్తున్నాయి.

నెరవేరని మెడికల్‌ కళాశాల హామీ..

ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రోజు రామగుండం వచ్చి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, మెడికల్‌ కళాశాలతో పాటు మైనింగ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తానని, సింగరేణి ఆసుపత్రికి కార్పొరేట్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చడం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని రామగుండం నియోజకవర్గంలోని 20 వేల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు చేపట్టిన 76 కోట్లతో చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం అర్ధంతరంగా నిలిచిపోయింది. దీనికి స్వయంగా సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయడం గమనార్హం. రెండేళ్లయినా ఎవరు పట్టించుకోవడం లేదు. సింగరేణి స్థలాలను క్రమబద్ధీకరించి కార్మికులకు ఇళ్ల పట్టాలను ఇస్తామన్న నేతల హామీ ఇంకా నెరవేరకలేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కోసం అంతర్గాంలో స్థలం చూసినప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాలేదు. ఐటీ పార్కు ప్రతిపాదన కూడా ముందుకు కదలడం లేదు. గడిచిన ప్రభుత్వ హయాంలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మంజూరైన 200 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికి కూడా పూర్తికాకపోవడం గమనార్హం. స్విమ్మింగ్‌పూల్‌, మినీ స్టేడియం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు తదితర పనులు ముందుకు సాగడం లేదు. సీసీరోడ్లు, బీటీరోడ్లు, డివైడర్లు, సెంట్రల్‌లైటింగ్‌ తదితర పనులు మాత్రమే జరిగాయి. సాధారణంగా వచ్చే నిధులే తప్ప ఇతరత్రా నిధులు రాక పనులు జరగడం లేదు. 

మానేరుపై పూర్తికాని వంతెనలు

గడిచిన ఈ రెండేళ్లలో మంథని నియోజకవర్గానికి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పెద్దగా నిధులు తీసుకవచ్చింది ఏమీ లేదు. పలుసార్లు అసెంబ్లీలో నియోజవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకవచ్చారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన పెద్దపల్లి-మంథని, గోదావరిఖని-కాటారం వరకుగల ప్రధానరహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సమస్యను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సీఎం దృష్టికి తీసుక వెళ్లడంతో డీఎంఎఫ్‌టీ ద్వారా నిధులు మంజూరయ్యాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో 2015లో మానేరునదిపై 47.40 కోట్ల రూపాయలతో చేపట్టిన ఓడేడు, రూ.49 కోట్లతో చేపట్టిన ఖమ్మంపల్లి బ్రిడ్జిల నిర్మాణాల పనులు ఇప్పటికీ పూర్తి కావడంలేదు. ఓడేడు వంతెన పనులైతే 40 శాతం కూడా కాలేదు. ఈ పనులను కాంట్రాక్టర్‌ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఖమ్మంపల్లి బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ బ్రిడ్జిల పనులు పూర్తికాకపోవడం వల్ల ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు చాలా కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. ఈ బ్రిడ్జిలు పూర్తయితే ఆయా జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనున్నది. ఇప్పటికైనా జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చి నిధులు మంజూరుచేయించాలని, చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-13T05:48:52+05:30 IST