అధికార పార్టీలో అంతర్మథనం

ABN , First Publish Date - 2020-12-07T05:39:28+05:30 IST

అధికార పార్టీలో అంతర్మథనం మొదలయింది.అంతా బాగానే ఉంది అన్న ధీమా సడలి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సిద్ధమయింది.

అధికార పార్టీలో అంతర్మథనం

ప్రారంభమైన పోస్టుమార్టం

పార్టీ పరిస్థితి, నాయకుల తీరుపై విచారణ

రంగంలోకి దిగిన నిఘా బృందాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అధికార పార్టీలో అంతర్మథనం మొదలయింది. అంతా బాగానే ఉంది అన్న ధీమా సడలి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సిద్ధమయింది. గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. పనిలోపనిగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, పథకాలపై, నాయకులపై ఉన్న విశ్వాసం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సేకరించేందుకు నిఘాబృందాలను పురమాయించిందని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో ఈ పరిశీలన జరిపి ఉన్నది ఉన్నట్లుగా నివేదిక సమర్పించాలని ఇంటలిజెన్స్‌ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తున్నది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించి ఈ రెండు చోట్ల టీఆర్‌ఎస్‌తో నువ్వా నేనా అన్నట్లు ఓట్లను సాధించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి తామేనని సవాల్‌ విసిరింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర, ఢిల్లీ నేతలు అత్యంత ధీమాగా ప్రకటిస్తున్న నేపథ్యంలో పరాజయం రుచి చూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం అప్రమత్తమయింది. 

పార్టీ మారే నాయకులపై ప్రత్యేక దృష్టి

భారతీయ జనతా పార్టీకి అనూహ్య విజయాలు అందిరావడంతో ఆ పార్టీవైపు పలువురు నేతలు దృష్టిసారించారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీ అగ్రనాయకత్వం కూడా అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, తదితర పార్టీల్లో ప్రజాబలం, క్షేత్రస్థాయిలో పట్టు, నాయకత్వ పటిమ ఉన్న నేతలపై ఆకర్ష్‌ వల విసురుతున్నదని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఏయే పార్టీ నేతలు ఎవరెవరు బీజేపీలో చేరుతారు అన్న విషయంలో జోరుగా చర్చ సాగుతున్నది. కరీంనగర్‌ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నేతలు కొందరు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్నదని, టీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పుడు కాకున్నా ఎన్నికల సమయానికి ముందు కొందరు అగ్ర నేతలు బీజేపీలో చేరే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ నాటికి ఉమ్మడి జిల్లా పరిధిలో పలు రాజకీయ సమీకరణాలు మారతాయని, ఎమ్మెల్యే టికెట్‌ ఆశించేవారిలో పలువురు ముందస్తుగాగాని, ఎన్నికల సమయంలోగాని బీజేపీలో చేరతారని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న సీనియర్‌ నేతలు కొందరు బీజేపీలో చేరతారని చర్చించుకుంటున్నారు. మంథని, ధర్మపురి, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలో ఈ పరిణామాలు జరగవచ్చని అనుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులతోపాటు ద్వితీయ, తృతీయశ్రేణి కార్యకర్తల్లో బీజేపీవైపు మొగ్గు చూపుతున్నవారెవరు, ఎందుకు వారు ఆ నిర్ణయం తీసుకుటున్నారు, వారి అసంతృప్తికి కారణమేమిటి అన్ని విషయాలను విచారించాలని నిఘాబృందాలకు ఆదేశించినట్లు సమాచారం. పార్టీ కేడర్‌లో అసంతృప్తి ఉంటే అందుకు కారణం స్థానిక నేతలా, స్థానిక ఎమ్మెల్యేలా, లేనిచో అగ్రనాయకత్వం విధానాలా అన్న విషయాన్ని పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారని తెలిసింది. 

నేతల బలాలు, బలహీనతల వివరాల సేకరణ

అన్ని ప్రాంతాల్లో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల గురించి ప్రజలమేనుకుంట్నురు, ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉన్నది, ప్రజలకు అందుబాటులో ఉంటున్నవారెవరు, వారి నడవడి, ఇతరత్రా విషయాల పట్ల ప్రజలమేనుకుంటున్నారు, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకులెవరు అన్న విషయాలను కూడా సేకరించాలని, అన్ని పార్టీల నేతల బలాలు, బలహీనతలు తెలుసుకొని సమాచారాన్ని సమర్పించాలని నిఘా బృందాలకు సూచించినట్లు సమాచారం. అలాగే వివిధ పథకాల అమలు, ప్రజల్లో వాటిపట్ల ఉన్న అభిప్రాయం, వారి నుంచి ఇంకా ఏమైనా సూచనలుంటే సేకరించి పంపాలని నిఘాబృందాలకు సూచించారని తెలిసింది.ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌పై ఉన్న అనుకూలతలను మాత్రమే కాకుండా ప్రజల్లో వ్యతిరేక భావనలు వ్యక్తమైనా ఉన్నది ఉన్నట్లుగా రిపోర్టు చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత ఆదేశించారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై, తన ప్రభుత్వంపై, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఇదే మొదటిసారి కావడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని, ప్రతి నేత బలం, బలహీనతల గురించి, మంచి చెడుల గురించి సమాచారం సేకరించడంతో పార్టీని పునాదుల నుంచి పటిష్టపర్చుకునే దిశగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారని అంటున్నారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన కుదుపు ఆ పార్టీలో పెద్ద చర్చకే తెరతీశాయి. 


Updated Date - 2020-12-07T05:39:28+05:30 IST